‘ఉద్ధానం’ సమస్యకు శాశ్వత విరుగుడు | Sakshi
Sakshi News home page

‘ఉద్ధానం’ సమస్యకు శాశ్వత పరిష్కారం

Published Wed, Aug 19 2020 10:53 AM

Uddanam Kidney disease: YS Jagan Government To Provide purified drinking water - Sakshi

శ్రీకాకుళం: హంగూ లేదు, ఆర్భాటం అంతకన్నా లేదు. సమస్యను మానవతా కోణంలో చూడటం, నిబద్ధతతో పరిష్కారంపై దృష్టి పెట్టడం. సరిగ్గా ఇదే పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు, పర్యటనల్లో పాదయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా బాధితుల పక్షాన తన మనసులో ఉన్న పరిష్కాన్ని పలుదఫాలుగా అధికారులతో చర్చించారు. ఏం చేస్తే ఉద్దానం బాధితులకు శాశ్వత ఉపశమనం లభిస్తుందో తెలుసుకున్నారు. ఆచరణాత్మకమైన మార్గంలో పని మొదలుపెట్టారు. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడు కనిపెట్టింది. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చింది. ఏమాత్రం హడావుడి, ఆర్భాటం లేకుండానే సమగ్ర తాగునీటి పథకం అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా కార్యాచరణతో రంగంలోకి దిగిపోయింది. 

తాగునీరే విషపూరితం – లక్షల్లో బాధితులు, వేలల్లో మరణాలు
ప్రపంచంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో అల్లాడే నాలుగు ప్రాంతాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంచినీటిలో ఉన్న విషపూరిత కారకాలు ఇక్కడ ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పలు పరిశోధనల్లో ప్రాధమికంగా తేల్చారు. ఈ సమస్యకు పరిష్కారం అప్పట్లోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారు. సురక్షితమైన తాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన మరణంతో ఈ పథకం అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ, పర్యటనలకు, ప్రకటనలకు పరిమితం అయ్యారే తప్ప, ఉద్దానం సమస్య పరిష్కారానికి కృషి చేయలేదనే వాదనలు ఉన్నాయి. 

తాజాగా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్దానంలో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ 700 కోట్ల అంచనాలతో ఈ పధకాన్నిడిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ  527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. 

త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఎంఈఐఎల్‌ సన్నాహాలు చేస్తోంది. తాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్  ఈ పథకాన్ని నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. 

హీర రిజర్వాయర్ నుంచి నీరు- భూగర్భ మార్గంలో తరలింపు
ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు.  తాగునీటికి బోరు నీరే ఆధారం. కానీ అవి విషపూరితం, రసాయనాల మయం. తప్పని పరిస్థితుల్లో అదే నీరు తాగుతున్నారు ఉద్దానం ప్రజలు. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. 

పాలకుల వైఫల్యం - ఏళ్ళుగా పీడిస్తున్న సమస్య
ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు. దీనిని పరిష్కరించడంలో ఎవరూ చిత్తశుద్ది చూపలేదు. నాడు వైఎస్సార్‌-  నేడు వైఎస్‌ జగన్  ప్రజలు, పీడితుల పక్షాన నిలబడ్డారు. 1985-86 లో బయటపడ్డా అప్పటి నుంచి ప్రభుత్వాల నిర్లక్షమే బాధితుల పట్ల శాపమైంది. 2004 అధికారం తర్వాత వైఎస్సార్ దృష్టి పెట్టినా, ఆయన అకాల మరణంతో సమస్య మొదటికి వచ్చింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, టీడీపీతో పాటు జనసేన పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది కోసం ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఉద్దానంలో 35 నుంచి 40 శాతం కిడ్నీ బాధితులు, వేల సంఖ్యలో మరణాలకు ఇప్పుడు వైఎస్‌ జగన్ ప్రభుత్వ సంకల్పం, మేఘా సంస్థ నైపుణ్యం పరిష్కారం చూపబోతున్నాయి.

Advertisement
Advertisement