విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారు

Udaya Bhaskar To High Court On APPSC Secretary and Additional Secretary - Sakshi

హైకోర్టుకు నివేదించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ 

సాక్షి, అమరావతి: తన అధికార విధులను నిర్వర్తించకుండా ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి, అదనపు కార్యదర్శి అడ్డుకుంటున్నారని కమిషన్‌ చైర్మన్‌ పి.ఉదయ భాస్కర్‌ హైకోర్టుకు నివేదించారు. అటెండర్, పేషీ సిబ్బందిని పొందే హక్కు తనకు ఉన్నప్పటికీ.. దానిని హరించారని పేర్కొన్నారు. చైర్మన్‌గా తన విధుల్లో జోక్యం చేసుకోవద్దని కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటినుంచీ తన ఆమోదం లేకుండా కమిషన్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2020 జనవరి నుంచి తనను ఏ అధికారిక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. 2020 ఫిబ్రవరి 25న జరిగిన సమావేశంలో నిబంధనలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాలేవీ చట్ట ప్రకారం చెల్లుబాటు కావన్నారు.

గ్రూప్‌–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్‌ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనతో పలువురు అభ్యర్థులు గత నెలలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి, చైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కమిషన్‌ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ పైవివరాలతో కౌంటర్‌ దాఖలు చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top