నేడు తుంగభద్ర బోర్డు భేటీ

Tungabhadra board meeting 29th September - Sakshi

నవలి బ్యారేజీ నిర్మాణం, కర్ణాటక జలచౌర్యమే అజెండా

వర్చువల్‌ విధానంలో సమావేశం

సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) జలాశయానికి ఎగువన కర్ణాటక సర్కార్‌ ప్రతిపాదిస్తున్న నవలి బ్యారేజీ నిర్మాణం, అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా జలదోపిడీ అజెండాగా బుధవారం తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్‌ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జలవరులశాఖల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు. టీబీ డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిందని చెబుతోన్న కర్ణాటక సర్కార్, తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద బ్యారేజీ నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీబీ బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించింది.

ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వాటాల్లో దామాషా ఆధారంగా భరించాలని ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశాయి. ఈ అంశంపై చర్చించాలని కర్ణాటక సర్కార్‌ కోరిన నేపథ్యంలో దాన్ని బోర్డు చైర్మన్‌ డీఎం రాయ్‌పురే అజెండాలో చేర్చారు. టీబీ డ్యామ్‌ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, 105 టీఎంసీలని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీబీ బోర్డు పేర్కొంది. కానీ దీన్ని కర్ణాటక సర్కార్‌ తోసిపుచ్చుతోంది. టీబీ డ్యామ్‌ నీటినిల్వ సామర్థ్యంపై రీ సర్వే చేయాలని కోరింది.

కర్ణాటక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. టీబీ డ్యామ్‌ నీటినిల్వ సామర్థ్యాన్ని 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే బోర్డును కోరారు. బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించనున్నాయి. టీబీ డ్యామ్‌లో ఎత్తిపోతల ద్వారా రెండు టీఎంసీలను తరలించడానికి మాత్రమే గతంలో బోర్డు నుంచి కర్ణాటక సర్కార్‌ అనుమతి తీసుకుంది. కానీ అక్రమ ఎత్తిపోతల ద్వారా అదనంగా 7.38 టీఎంసీలు తరలిస్తున్నట్లు బోర్డు జాయింట్‌ కమిటీ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తేల్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్‌పై చర్యలు తీసుకుని ఆ రాష్ట్ర వాటాలో కోత వేసేలా బోర్డుపై ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top