
వీఐపీలకు నేనే ప్రొటోకాల్ దర్శనం చేయిస్తా
భక్తులను మభ్యపెట్టి ముంచేసిన టీడీపీ నాయకుడు
రూ.4 లక్షలకు కుచ్చుటోపీ
తిరుమల: ‘నేను టీటీడీలో ఉద్యోగిని. రాష్ట్ర హోం మంత్రి అనితకు బాగా క్లోజ్. ఆమె తరఫున వచ్చే వీఐపీలకు నేనే ప్రొటోకాల్ దర్శనం చేయిస్తా’ అంటూ భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన టీడీపీ నాయకుడి గుట్టు రట్టయ్యింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి రెడ్డివీధికి చెందిన బురిగాల అశోక్ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి తిరుమలలో దళారీగా చలామణి అవుతున్నాడు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, హోం మంత్రి వంగల పూడి అనితతోపాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ భక్తులను మోసగిస్తుంటాడు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన భజరంగ్ అమన గోయల్, పది మంది కుటుంబ సభ్యులకు సుప్రభాతం, తోమాల, అభిõÙకం సేవలతో పాటుగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ దర్శనాలకు చాలా ఖర్చవుతుందని నమ్మించాడు. తిరుమలకు రాకముందే బేరసారాలు సాగించాడు. ఫైనల్‌గా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.4 లక్షలు వసూలు చేశాడు.
ఇటీవల భక్త బృందం తిరుమలకు రాగానే అదనంగా రూ.10 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బయటకు వెళ్లిన వెంటనే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో మోసపోయామని గ్రహించి భక్తులు శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వింగ్ ఏవీఎస్‌ఓ ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు.