రైతు నోటమాట లేదు | Tomato prices have fallen sharply across markets in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రైతు నోటమాట లేదు

Mar 24 2026 4:21 AM | Updated on Mar 24 2026 4:21 AM

Tomato prices have fallen sharply across markets in Andhra Pradesh

పలమనేరులోని వి.కోట ప్రాంతంలో టమాటాను పడేస్తున్న రైతులు

భారీగా పతనమైన టమాటా ధరలు

సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ప్రాంతాన్ని బట్టి.. నాణ్యతను బట్టి కిలో టమాటా రూ.30 నుంచి రూ.60 పలుకుతోంది. టమాటా సాస్‌ ధర కిలో రూ.120 పైమాటే. కానీ.. వాటిని పండించే రైతులకు కిలోకు రూపాయి నుంచి రూ.3 మాత్రమే దక్కుతోంది. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలడం లేదు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.

ధర లేక దిగాలు
రాష్ట్రంలో 1.55 లక్షల ఎకరాల్లో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరులో 85 వేలు, అనంతపురంలో 48 వేలు, కర్నూలులో 8 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 17 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. ఎకరాకు 14 టన్నుల చొప్పున ఏటా రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. రాయలసీమలోని 3 జిల్లాల నుంచే 20.36 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. నిత్యం చిత్తూరు మార్కెట్‌కు 300–400 టన్నులు, అనంతపురం మార్కెట్‌కు 80–100 టన్నులు, కర్నూలు మార్కెట్‌కు 80–150 టన్నుల చొప్పున వస్తుంటాయి.

చిత్తూరు జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో కిలోకు సగటున రూ.1.40 నుంచి రూ.3 దక్కుతుంటే.. ఉరవకొండ మార్కెట్‌లో కిలో రూ.2–3కు మించి లభించడం లేదు. అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్‌లో కిలోకు రూ.3–7, పలమనేరు మార్కెట్‌లో కిలోకు రూ.3–7, మదనపల్లి మార్కెట్‌లో కిలోకు రూ.7 వరకు దక్కుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌ ధరతో పోలిస్తే రైతులకు  పదోవంతు కూడా దక్కడం లేదు.

గతేడాది కిలో రూ.8కి కొంటామని 
గతేడాది కూడా ఇదే రీతిలో కిలో రూపాయికి కూడా కొనేవారు లేక టమాటా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అప్పట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తామని ప్రకటించి చేతులెత్తేసింది. ఇదిగో కొంటాం.. అదిగో కొంటామని కాలయాపన చేసింది. చివరకు ఎప్పుడు కొంటారని రైతులు నిలదీస్తే ‘నో ప్రాఫిట్‌.. నో లాస్‌’ పద్ధతిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామే తప్ప.. కిలో రూ.8కు కొనేందుకు డబ్బులు లేవని మార్కెటింగ్‌ శాఖ చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. టమాటా రైతుల దుస్థితిపై కనీసం స్పందించకుండా ఈ టమాటా థర్డ్‌ క్వాలిటీ అంటూ అధికారులు మాట దాటవేస్తున్నారు.

ఐదేళ్లపాటు టమాటా రైతుకు అండగా..
గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం టమాటా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచింది. మార్కెట్‌లో ధరలేని ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మద్దతు ధరకు కొనుగోలు చేసేది. డిమాండ్‌కు తగిన సరఫరా లేక మార్కెట్‌లో ధరలు చుక్కలనంటుతున్నప్పుడు కూడా ఇదే రీతిలో మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గరిష్టంగా కిలో రూ.107కు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కిలో రూ.50కే సరఫరా చేసింది. ఇలా రైతులకు అండగా నిలవడంతోపాటు ఇటు వినియోగదారులపై భారం పడకుండా చేసింది. గడచిన ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రూ.18.02 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి 8,459.56 టన్నుల టమాటాను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచింది.

కిలోకు రూ.2 ఇస్తున్నారు
రెండెకరాల్లో టమాటా వేశాను. ఎకరాకు రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. రోజు విడిచి రోజు 2 నెలలుగా మార్కెట్‌కి రోజుకు టన్ను టమాటా తీసుకొస్తున్నా. కేజీ రూ.3 కంటే తక్కువే పలుకుతోంది. ఈ రోజు కిలోకు రూ.2 ఇస్తున్నారు. గతేడాది ఇలాగే ధరలేక నష్టపోయాం. ఈసారి కూడా ధర లేక నష్టపోతున్నాం. ఉరవకొండ మార్కెట్‌కు వచ్చే రైతులందరిదీ ఇదే పరిస్థితి.       – ఎ.రామాంజనేయులు, షేక్షానిపల్లి, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement