ప్రాజెక్టులు అప్పగించకుండా ఎలా అదుపు చేయాలి? | Krishna River Board Write A Letter to AP ENC and Telangana ENC | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు అప్పగించకుండా ఎలా అదుపు చేయాలి?

Mar 24 2026 4:05 AM | Updated on Mar 24 2026 4:05 AM

Krishna River Board Write A Letter to AP ENC and Telangana ENC

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను నిలదీసిన కృష్ణా బోర్డు 

శ్రీశైలం, సాగర్‌ నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు 

కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు వెలువడితేనే స్పష్టత వస్తుందన్న బోర్డు 

అప్పటి వరకు సమన్వయంతో వ్యవహరించాలని ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు లేఖ  

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా.. నీటి వినియోగాన్ని అదుపు చేయాలని పరస్పరం తమకు ఫిర్యాదు చేస్తే ఎలా అదుపు చేయగలమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను కృష్ణా బోర్డు ప్రశ్నించింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌)–2 తుది తీర్పు వెలువడే వరకూ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు కృష్ణా బోర్డు ఈ నెల 20న లేఖ రాసింది.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ ఈఎన్‌సీ.. వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకున్నందున, అదనంగా నీటిని వాడుకోకుండా నియంత్రించాలంటూ తెలంగాణ ఈఎన్‌సీ ఇటీవల కృష్ణా బోర్డుకు లేఖలు రాశారు. తెలంగాణ కూడా కోటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి అదనపు నీటిని వాడుకోకుండా నియంత్రించాలని ఏపీ ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.

దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీలను కేటాయించారని ఇరు రాష్ట్రాలకు గుర్తు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కు అప్పగించిందని గుర్తు చేసింది. నీటి పంపిణీపై కృష్ణా బోర్డు విచారణ చేస్తోందని పేర్కొంది.  

తాత్కాలికంగా శ్రీశైలంను ఏపీ, సాగర్‌ను తెలంగాణ నిర్వహించాలి 
కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవడానికి 2015 జూన్‌ 18, 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని కృష్ణా బోర్డు వివరించింది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం 2021 జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, దానిపై తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో అది అమల్లోకి రాలేదని పేర్కొంది.

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించాలని కేంద్రం పేర్కొందని వెల్లడించింది. ప్రాజెక్టులు తమకు అప్పగించని నేపథ్యంలో.. నీటి వినియోగాన్ని అదుపు చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు అమల్లోకి వచి్చ.. నీటి వాటాలు తేలే వరకూ రెండు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement