వంట గ్యాస్‌ నిల్‌.. సర్కారు ‘గ్యాస్‌’ ఫుల్‌! | Cooking gas shortage in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌ నిల్‌.. సర్కారు ‘గ్యాస్‌’ ఫుల్‌!

Mar 24 2026 3:52 AM | Updated on Mar 24 2026 3:52 AM

Cooking gas shortage in Andhra Pradesh

రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం

ఏజెన్సీలకు గతంలో కంటే 20 శాతం తక్కువగా సరఫరా  

ఇప్పటికే 40 శాతం మేర డెలివరీలు పెండింగ్‌.. ఏపీ అవసరాలకు రోజుకు 4 వేల టన్నుల గ్యాస్‌ అవసరం 

ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్నది 14 వేల టన్నులే  

ఇటీవల వరుసగా సెలవులు రావడంతో ఉత్పత్తి బంద్‌.. ఫలితంగా గ్యాస్‌ ఏజెన్సీలకు క్యూ కడుతున్న ప్రజలు.. చంద్రబాబు మాత్రం గ్యాస్‌ కొరత లేదంటూ ఉత్తుత్తి కబుర్లు 

మరోవైపు ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, పీఎన్‌జీ వినియోగం పెంచాలని సూచనలు 

పీఎన్‌జీ కోసం నెలకు రూ.1,000 చెల్లించక తప్పదంటున్న నిపుణులు 

దిగజారిన పరిస్థితుల్లో మళ్లీ కిరోసిన్‌ వినియోగం అంటున్న సర్కారు

ఉత్తరాంధ్రలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ నెలకు 17 వేలకుపైగా సిలిండర్లు డెలివరీ చేసేది. నిత్యం 650కిపైగా బుకింగ్‌లు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటి వరకు 10 వేల సిలిండర్లు మాత్రమే డెలివరీ చేసింది. పెండింగ్‌లో ఇంకా 7 వేల బుకింగ్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంపెనీ నుంచి వచ్చే స్టాక్‌ ఇప్పుడు తగ్గిపోయింది. మరోవైపు ఆందోళనతో బుకింగ్‌లు డబుల్‌ అవుతున్నాయి.దీంతో గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. సిలిండర్‌ బుక్‌ చేసి 10–15 రోజులవుతున్నా డెలివరీ ఇవ్వలేదని, ఎప్పుడిస్తారని వినియోగదారులు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని సదరు ఏజెన్సీ డీలర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రంలో గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లందరిదీ ఇదే పరిస్థితి.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్‌ సంక్షోభం ముదురుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొంగ జపం చేస్తోంది. గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు పది రోజులైనా సిలిండర్లు డెలివరీ చేయలేక ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అబ్బే.. అంత సమస్య లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్యాస్‌ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు మూతపడేలా చేసింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన సర్కార్‌.. ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్‌ బుకింగ్‌లకు తగ్గట్టు సరఫరా జరగడం లేదు. ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, గతంలో నెలకు సగటున 70 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అంటే రోజుకు 2.5 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ ఇస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.80 లక్షలకు పడిపోయింది.     

మొత్తంగా 60 శాతం కొరత! 
ఏపీలో గృహ వినియోగ అవసరాల కోసం రోజుకు 4 వేల టన్నుల గ్యాస్‌ నిల్వలు అవసరం. ప్రస్తుతం ఏపీలో 14 వేల టన్నుల నిల్వ ఉందని,  నాలుగు రోజులకు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు ఏజెన్సీలకు సరఫరా చేసే గ్యాస్‌లో 15–20 శాతం తగ్గుదల ఉంటోంది. ఫలితంగా 40 శాతం వరకు డెలివరీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. మొత్తంగా క్షేత్ర స్థాయిలో 60 శాతం గ్యాస్‌ కొరత ఉంటే, ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతోంది.

2025 మార్చిలో ఏజెన్సీలకు సరఫరా చేసిన గ్యాస్‌కు.. ఈ నెలలో గ్యాస్‌ స్టాక్‌లో తీవ్రమైన తగ్గుదల ఉందని డీలర్లు వాపోతున్నారు. పైగా ఉగాది, రంజాన్‌ సెలవులు రావడంతోపాటు ఆదివారం సెలవును సాకుగా చూపించి, రాష్ట్రంలోని ప్లాంట్‌లలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కారణంగా వారం రోజుల డెలివరీలను 10 రోజులైనా చేయలేకపోతోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఆదివారం సెలవు తీసుకోని ప్లాంట్లు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదన్నది అతిపెద్ద ప్రశ్న. ఇంకో వైపు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా తగ్గించి, వాటిని పట్టణ ప్రాంతాలకు మళ్లిస్తోంది. అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోనూ సమయానికి వినియోగదారులకు గ్యాస్‌ అందట్లేదు.    

ప్రజలే భారం మోయాలా? 
సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని, తాజాగా గ్యాస్‌ సమస్యలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా గ్యాస్‌ కొరత లేదు. అక్కడి హోటళ్లు మూత పడలేదు. వినియోగదారులు ఏజెన్సీల ఎదుట క్యూ కట్టలేదు. కానీ, బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్‌లో మాత్రం గ్యాస్‌ కోసం ప్రజానీకం అల్లాడుతోంది. ఆహార, వాణిజ్య రంగం కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది.

ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉచిత సలహాలు మినహా పేదలకు ఒరగబెట్టింది ఏదీ కనిపించట్లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్‌ కొరత లేదంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. పైగా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ పేదల నెత్తిపై భారం మోపే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఒక మధ్య తరగతి కుటుంబం సగటున 14.2 కిలోల సిలిండర్‌ను నెలన్నరకుపైగా వినియోగిస్తుంది.

అంటే, రూ.937 వెచ్చిస్తే దాదాపు 45 రోజులకుపైగా గ్యాస్‌పై వంట చేసుకోవచ్చు. కానీ, పీఎన్జీ తీసుకుంటే రూ.వేలల్లో కనెక్షన్‌ ఫీజు ముందుగా కట్టడంతోపాటు నెలకు రూ.1000కిపైగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, సాధారణ సిలిండర్‌ కంటే పీఎన్జీ కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉచిత సలహా ఇస్తుండటం ఆరి్థక వేత్తలను కలవరపెడుతోంది.   

‘కిరోసిన్‌’ లీకులతో కాలక్షేపం 
చంద్రబాబు సర్కార్‌ గ్యాస్‌ కొరత లేదంటూనే పేదలకు ప్రత్యామ్నాయంగా కిరోసిన్‌ పంపిణీ చేస్తామని లీకులు ఇచ్చింది. తొలుత ఏజెన్సీ ఏరియాల్లో రేషన్‌ డీలర్ల ద్వారా కిరోసిన్‌ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. తీరా చూస్తే ఏపీలో అందుబాటులో ఉన్న కిరోసిన్‌ నిల్వ కేవలం 2,700 కిలో లీటర్లు మాత్రమే. వాస్తవానికి 1.48 కోట్ల రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి లీటరు చొప్పున కిరోసిన్‌ ఇవ్వాలంటే సుమారు 14,800 కిలో లీటర్లు అవసరం.

కానీ, 18 శాతం కూడా పంపిణీకి సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు  ప్రకటనలు గుప్పించింది. కిరోసిన్‌ ఫ్రీ స్టేట్‌గా మారిన ఏపీని చంద్రబాబు మళ్లీ కిరోసిన్‌ ఆధారిత రాష్ట్రంగా మార్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 20కి పైగా కిరోసిన్‌ ఫ్రీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. గ్యాస్‌ కొరతతో ఏ రాష్ట్రం కూడా కిరోసిన్‌ వినియోగంపై ఆలోచన చేయట్లేదు. కానీ, ఒక్క ఏపీలో మాత్రమే కిరోసిన్‌ పంపిణీ మళ్లీ పునఃప్రారంభించాలని చూడటం స్థానికంగా దిగజారిన జీవన ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకవేళ సర్కారు కిరోసిన్‌ పంపిణీ చేసినా ప్రజలు కిరోసిన్‌ స్టవ్‌ల కోసం దుకాణాలకు పరుగుపెట్టాలి. ఆ మేరకు కిరోసిన్‌ స్టవ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయా?  

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి 
 ⇒ సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 
 ⇒ వాణిజ్య గ్యాస్‌ సరఫరాను పూర్తిగా నిలిపి వేయడంతో పది రోజులుగా వ్యాపారాలు చతికిలపడ్డాయి.  
 ⇒ బ్లాక్‌ మార్కెట్‌ దందాకు గేట్లు తెరుచుకున్నాయి. రూ.2 వేలు ఉండే ఒక్కో సిలిండర్‌ను రూ.4 వేల నుంచి రూ.4500 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.  

చిరు హోటల్‌ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. రూ.వేలు పెట్టి సిలిండర్లు కొనలేక, హోటళ్లను మూసేస్తున్నారు. టీ దుకాణాల్లో ‘స్పెషల్‌ టీ’ల అమ్మకాలు ఆపేశారు.  

 ⇒ ప్రభుత్వం చాలా చోట్ల హాస్టళ్లకు కూడా సిలిండర్లను సరఫరా చేయించలేకపోతోంది.  
 ⇒ స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లకు బ్లాక్‌ మార్కెట్‌లో గ్యాస్‌ కొనగలిగే స్తోమత ఉంటుంది. కానీ, 25 వేల మంది చిరు వ్యాపారులు ఆ భారాన్ని మోయలేక కొందరు దుకాణాలు మూసేయగా, మరికొందరు ప్రత్యామ్నాయ పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు హాస్టళ్లు, స్కూళ్లు ఉగాది, రంజాన్‌ సెలవులను సాకుగా చూపించి విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి.

స్టాక్‌ మేరకు పంపిణీ చేస్తున్నాం
మా ఏజెన్సీల్లో స్టాక్‌ ఉన్నంత మేరకు వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. ఫస్ట్‌ బుకింగ్‌.. ఫస్ట్‌ ప్రయార్టీ ప్రకారం చేస్తున్నాం. గృహ వినియోగదారులు ఎవరి సిలిండర్లను వారే వాడుకోవాలి. వాణిజ్య సిలిండర్లు తొలుత పట్టణాల్లో 30 శాతం మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి.  
– కె.శ్రీనాథ్‌రెడ్డి, ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement