Andhra Pradesh: మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే..కానీ సేవల్లో శ్రీమంతులు

They Belong To Middle Class Family But Rich In Services - Sakshi

ఆ ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. అయితేనేం సేవలో మాత్రం శ్రీమంతులని నిరూపించుకున్నారు. తమకు ఉన్నంతలోనే సాయపడుతు న్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకతను కరోనా సమయంలో పేదలకు అండగా నిలిస్తే.. మరొకతను ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఓ మహిళ బాలికలకు తోడుగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం, కరవళ్ల రవీంద్రారెడ్డి, జ్యోతి జయలక్ష్మి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
– ఆత్మకూరు 

వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని..

పీఎస్ఆ‌ర్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరవళ్ల రవీంద్రారెడ్డి సామాన్య రైతు. పొలం పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది తన కొడుకు పుట్టినరోజు నాడు 200 మందికిపైగా పేదలకు దుప్పట్లు, వస్త్రాలు అందజేస్తుంటారు. ఇంకా నల్లపరెడ్డిపల్లి, బట్టేపాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్‌ విద్యార్థులకు, ఆత్మకూరు కళాశాలలో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈయన సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సమీప బంధువులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. 

కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు పెట్టి.. 

దొరవారిసత్రం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అండగా ఉంటారనుకున్న అక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దాతల సహకారంతో సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నారు. బీకాం కంప్యూటర్స్‌ చేశారు. ఈయన 18 ఏళ్ల క్రితం ఆత్మకూరులో స్థిరపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వల్ల అనేక మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంకా తల్లి పేరుతో రమా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మదర్‌థెరిస్సా జయంతి రోజున గిరిజన, దళితకాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేస్తుంటారు. ఉపాధి కోసం పలువురికి ఉచితంగా కంప్యూటర్లను అందజేశారు. ఈయన సేవలను చూసి పలువురు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ట్రస్ట్‌కు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో కాలనీల్లో నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను రోజుల తరబడి పంపిణీ చేశారు. దాతల సహకారంతో నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశారు. చేసిన సేవలకు గానూ ఇప్పటికి ఆరుసార్లు మంత్రులు, కలెక్టర్‌ ద్వారా అవార్డులు అందుకున్నారు. 

బాలికలకు భరోసా

జ్యోతి జయలక్ష్మి ఆత్మకూరు మండలం కరటంపాడు మజరా శ్రీనివాసపురం దళితకాలనీకి చెందిన మహిళ. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనైనా వివాహానంతరం శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. భర్త ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పటి నుంచి సేవా భావాలు కలిగిన జయలక్ష్మి కిశోర బాలికల సమస్యలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన న్యాప్‌కిన్లు, సోప్‌లు అందజేశారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తన సేవలను మరింత విస్తరించారు. పౌష్టికాహారం తయా రు చేసి పేద పిల్లలకు అందిస్తున్నారు. పేద బాలికలకు యూనిఫాం కొనుగోలు చేసి అందజేశారు. కాలనీల్లో ప్రజలకు పరిశుభ్రత, దాని ప్రాధాన్యం వివరిస్తూ వారిని క్రమశిక్షణ దిశగా నడిపిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top