ఇక రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్ | There is a rest house next to the road( | Sakshi
Sakshi News home page

ఇక రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్

Jul 25 2024 5:30 AM | Updated on Jul 25 2024 5:30 AM

There is a rest house next to the road(

జాతీయ రహదారులపై ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ నిర్మాణం

ప్రతి 50 కి.మీ. ఒకటి చొప్పున నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం

తొలి దశలో దేశవ్యాప్తంగా వెయ్యి.. ఏపీలో 75 నిర్మాణానికి ప్రణాళిక

జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేదదీరాల్సి వస్తుంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్స్‌ వద్ద ఆగాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణించేవారు చార్జింగ్‌ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. రాత్రివేళ డ్రైవర్లకు నిద్ర ఆవహిస్తుంటే ఓ కునుకు తీసేందుకు సురక్షితమైన ప్రదేశం ఏదన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. 

ఈ అవసరాలు తీర్చే ప్రదేశాలు వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకేచోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉంటుంది. అందుకోసమే ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ (డబ్ల్యూఎస్‌ఏ)లు నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ను నిర్మించే ప్రణాళికకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది.  – సాక్షి, అమరావతి

అన్ని వసతులూ ఒకేచోట..
దేశంలో హైవేల వెంబడి రెస్ట్‌హౌస్‌ల తరహాలో నిర్మించే ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’లలో ప్రయాణికులు సేదతీరేందుకు అన్ని వసతులు ఒకేచోట ఉండేలా చూస్తారు. ఇప్పటివరకు హైవేల నిర్మాణంతోపాటే ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ‘పార్కింగ్‌ బే’లను నిర్మిస్తున్నారు. ఆ ప్రదేశంలో లారీలు, ఇతర వాహనాలను నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది. 

కానీ.. డ్రైవర్లు, ప్రయాణికులకు విశ్రాంతి, భోజనం, ఆహ్లాదం, నిద్రించేందుకు ఎటువంటి వసతులు ఉండటం లేదు. భోజనం, టిఫిన్లు చేసేం­దుకు ఎక్కువగా ప్రైవేటు దాబాల వద్ద వా­హ­నాలను నిలుపుతున్నారు. కానీ.. విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతపై భరోసా ఉండటం లేదు.

 దాంతో అప్పటికే అలసిపోయి­నప్పటికీ, అర్ధరాత్రి అయినప్పటికీ వాహన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ అనివార్య పరిస్థితి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోంది. దీనికి పరిష్కారంగానే ప్రయాణికులకు అన్ని వస­తులతో కూడిన ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. వాటిలో రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట స్థలాలు, పెట్రోల్‌ బంక్‌లు, ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, ఏటీఎంలు వంటి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తారు.

రాష్ట్రంలో తొలి దశలో 75 నిర్మాణం
దేశవ్యాప్తంగా హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ‘వే సైడ్‌ ఎమినిటీ’ నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. తొలి దశలో దేశంలో 1,000 చోట్ల వీటి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హైవే నిర్మాణ కాంట్రాక్టులో భాగంగా కాకుండా ప్రత్యేకంగా వే సైడ్‌ ఎమినిటీస్‌ నిర్మిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఎన్‌హెచ్‌­ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఒక్కొక్కటి సగటున రూ.10 కోట్ల చొప్పున మొత్తం మీద రూ.10 వేల కోట్లతో నిర్మించాలన్నది ప్రణాళిక. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) విధానంలో వాటిని నిర్మిస్తారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8,683 కిలోమీటర్ల మేర హైవేలు ఉన్నాయి. ఏపీలో 75 ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ నిర్మించను­న్నారు. కాగా.. వాటిలో అత్యంత ప్రధానమైనది కోల్‌కతా–చెన్నై హైవే రాష్ట్రంలో 1,025 కి.మీ. పొడవున ఉంది. మొదటి దశలో కోల్‌కతా–చెన్నై హైవే వెంబడి 25 నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ త్వరలోనే నిర్ణీత ప్రదేశాలను ఎంపిక చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. రానున్న మూడేళ్లలో వాటిని నిర్మించాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా నిర్ణయించింది.

దేశంలో వే సైడ్‌ ఎమినిటీలు ఇలా..
ఎక్కడ: ప్రతి 50 కి.మీ.కు 1

ఎన్ని చోట్ల: 1,000

ఒక్కోదానికి అయ్యే వ్యయం: రూ.10 కోట్లు

మొత్తం వ్యయం: రూ.10,000 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం హైవేలు: 8,683 కి.మీ

 ఏపీలో నిర్మించనున్న వే సైడ్‌ ఎమినిటీలు: 75

మొదటి దశలో నిర్మించేవి: 25

ఎన్నేళ్లల్లో నిర్మిస్తారు: 3 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement