పోటాపోటీ ధర్నాలు.. ఆంక్షల ఉల్లంఘన | Tensions erupted in Thadepalli Mangalagiri and Amaravati areas with dharnas | Sakshi
Sakshi News home page

పోటాపోటీ ధర్నాలు.. ఆంక్షల ఉల్లంఘన

Aug 9 2021 2:18 AM | Updated on Aug 9 2021 2:18 AM

Tensions erupted in Thadepalli Mangalagiri and Amaravati areas with dharnas - Sakshi

మహిళా పోలీసులను తోసుకొని ముందుకెళ్లే యత్నం చేస్తున్న అమరావతి మహిళలు

తాడికొండ, తాడేపల్లి రూరల్, మంగళగిరి: వికేంద్రీకరణకు మద్దతుగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఆదివారం చేపట్టిన ర్యాలీలు, ధర్నాలతో తాడేపల్లి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య కాస్త తోపులాట జరిగింది. ఓ వర్గం వారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, పోలీసులను దూషించారు. మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి నాయకులు దేవస్థానం టు న్యాయస్థానం పేరిట పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళగిరి, తాడేపల్లి, ఎన్‌ఆర్‌ఐ జంక్షన్‌ పలు ప్రాంతాల్లో బేతపూడి రాజేంద్ర, పులి దాసు, లోకేష్, ఉదయ్‌ భాస్కర్, వడిత్యా శంకర్‌ నాయక్, ఈపూరి ఆదాం, పలువురు దళిత నాయకులు, మహిళలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లలో నిర్బంధించారు. దీంతో తాడేపల్లిలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  

అమరావతికి బస్సులో వెళుతున్న మహిళలను పోలీసులు ఉండవల్లి సెంటర్‌లో అడ్డగించారు. దీంతో మహిళలు బస్సు దిగి.. ధర్నాకు ఉపక్రమించారు. పోలీసులు అడ్డుకోగా మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తుదకు పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని బస్సు ఎక్కించి మందడంలోని దీక్షా శిబిరానికి పంపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో నివసించే వారితో పాటు చుట్టుపక్కల వారికి సీఎం జగన్‌ ఇళ్ల స్థలాలను కేటాయిస్తే దానిని వ్యతిరేకిస్తూ టీడీపీ మద్దతు దారులు కోర్టును ఆశ్రయించడం దారుణం అన్నారు.  
మంగళగిరిలో బహుజన పరిరక్షణ సమితి నాయకులను అడ్డుకోవడంతో మహిళల నిరసన 

హైకోర్టు నుంచి మంగళగిరి వరకు..
అమరావతి పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా ఆంక్షల ఉల్లంఘన జరిగింది. 30 పోలీస్‌ యాక్ట్, 144 సెక్షన్‌ అమలులో ఉందని తెలిపినా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట హైకోర్టు నుంచి మంగళగిరి వరకు యాత్ర తల పెట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల వద్ద నుంచి ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వారిని అసభ్య పదజాలంతో దూషించారు. ముఖ్యమంత్రిని సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పంట పొలాల్లో నుంచి హైకోర్టు వద్దకు చేరుకునేందుకు యత్నించడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి అమరావతి, పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.  

ఆంక్షల వలయంలో ఆలయం
అటు రాజధాని ప్రాంత మద్దతుదారులు, ఇటు బహుజన పరిరక్షణ సమితి నేతల పిలుపుతో మంగళగిరి పట్టణంలోని నృసింహస్వామి ఆలయం చుట్టూ ఆదివారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. భక్తుల ముసుగులో కొందరు ఆలయం లోపలికి వెళ్లి జై అమరావతి.. అని నినాదాలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ.. పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement