రోహిణి తీవ్రత లేనట్టే! | Sakshi
Sakshi News home page

రోహిణి తీవ్రత లేనట్టే!

Published Wed, May 29 2024 5:56 AM

Temperatures will rise slightly for three days

మూడు రోజులు స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు 

వడగాడ్పులకు ఆస్కారం లేదంటున్న ఐఎండీ 

గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు 

సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఎప్పట్నుంచో ఉంది.   ఈ కార్తె వస్తోందంటేనే జనం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఏప్రిల్‌ నుంచే మొదలవడంతో రోహిణి కార్తె ప్రవేశిస్తే ఇంకెంతలా ఉష్ణతాపం పెరిగిపోతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రోహిణి కార్తె ఈనెల 25న ప్రవేశించింది. ఆ సమయానికి బంగాళాఖాతంలో ‘రెమాల్‌’ తుపాను కొనసాగుతుండడంతో రోహిణి తీవ్రత కనిపించ లేదు. 

మరోవైపు రాష్ట్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలిలో కొద్దిపాటి తేమ ఇంకా ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంపైకి గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవి భానుడి ప్రతాపాన్ని అదుపు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటున్నాయి. వాస్తవానికి రోహిణి కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతలు 42–46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. దీంతో పలు చోట్ల  వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. 

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇవి సాధారణంకంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికం. రానున్న మూడు రోజులు కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగానే పెరగడం వల్ల వడగాడ్పులు గాని, తీవ్ర వడగాడ్పులు కూడా వీచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. 

భారత వాతావరణ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, నెలాఖరు వరకు వడగాడ్పులకు ఆస్కారం లేదని వెల్లడించింది. రోహిణి కార్తె ఎండలపై భీతిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. 

సీమలో పిడుగుల వాన.. 
మరోవైపు దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నెలాఖరు వరకు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement