
రణభేరి బహిరంగ సభలో నినదిస్తున్న రాష్ట్రంలోని ఉపాధ్యాయులు
పీఆర్సీని ఎప్పుడు నియమిస్తారని నిలదీత
డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్
ఉపాధ్యాయులపై పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరిక
కూటమి సర్కారు నిర్వాకంతో బడుల్లో విద్యార్థుల సంఖ్య 32 లక్షల నుంచి 29.50 లక్షలకు పడిపోయిందని వెల్లడి
వచ్చే నెలలో భవిష్యత్ కార్యాచరణకు నిర్ణయం
గుంటూరు (ఎడ్యుకేషన్): కూటమి ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు గుంటూరులో రణభేరి మోగించారు. పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారని నిలదీశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఉపాధ్యాయులు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ‘రణభేరి’ బహిరంగ సభ నిర్వహించారు.
సభలో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మన్ ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు 12వ పీఆర్సీపై ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదన్నారు. నాలుగు విడతల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలతో పాటు ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్ డబ్బులు అడిగితే అంక్షలు పెడుతున్నారని ఆరోపించారు.
రూ.15 వేల కోట్లకు పైగా నిధుల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.200 కోట్లు చెల్లింపుల కోసం సైతం పదేపదే తిరగాల్సి వస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అక్టోబర్‌లో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, 25 నెలలుగా పీఆర్సీ బకాయిలు పేరుకుపోయాయయని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజుకో యాప్.. పూటకో మెసేజా..?
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను రోజుకో యాప్, పూటకో మెసేజిలతో అష్టదిగ్భంధనం చేస్తున్న విద్యాశాఖ వారిపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి సాల్ట్ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను 9 కేటగిరీలుగా మార్చి విద్యార్థులను అయోమయాన్ని గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్‌లో ప్రాథమిక పాఠశాలలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరిట అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 32 లక్షల నుంచి 29.50 లక్షలకు పడిపోయిందన్నారు. ఉద్యోగుల బకాయిలు, సరెండర్ లీవులు, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సుల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 10,300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నారు.
9,600 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం చెప్పినట్టు ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల నియామకంతో పాటు 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. అన్ని మేనేజ్‌మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎంఈఓ, డీవైఈవో, డీఈవోలుగా నియమించేందుకు కామన్ సర్వీస్ రూల్స్‌పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్నారు. అక్టోబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనాలు, విద్యారంగ మార్పుల కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.
కార్పొరేట్లకు కారుచౌకగా ప్రభుత్వ భూములు
పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల శ్రేయస్సును విస్మరించిన ప్రభుత్వం కార్పొరేట్లకు కారుచౌకగా సమాజ ఆస్తులను కట్టబెడుతోందని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సభలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర ఎన్జీవో సంఘం కార్యదర్శి టీవీ రమణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.ప్రభుదాస్, యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సురేష్, ఏఎన్ కుసుమకుమారి, కోశాధికారి మోహనరావు, ప్రచురణల కమిటీ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్ తదితరులు పాల్గొన్నారు.