రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్‌ ఆప్షన్‌

Teacher transfer web option till tomorrow - Sakshi

సీపీఎస్‌ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం

చంద్రబాబు హయాంలో అన్నీ అక్రమ బదిలీలే..

విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్న టీచర్ల అరెస్టు ఘనత ఆయనదే..

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియ గడువు ఈ నెల 15తో ముగియగా, ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల వినతి మేరకు మరో మూడ్రోజులు అంటే రేపటి వరకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అక్యూరల్‌ ఫర్మ్‌ పేరుతో ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్సూ్యరెన్స్‌ ప్రీమియం, రిస్క్‌లకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.

సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం వరకు 71,947 మంది (సుమారు 95 శాతం) టీచర్లు వెబ్‌ ఆప్షన్‌ను వినియోగించుకున్నారన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తరవాతే బదిలీలకు సంబంధించి సవరించిన జీవో నెంబర్లు 53, 54, 59లను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టామని చెప్పారు. కేటగిరీ 4లోని పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులే విద్యనభ్యసిస్తుంటారని, అవి నిర్వీర్యమైపోకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనుమానాలను పెనుభూతాలుగా మార్చి, రాజకీయాలకు వాడుకోవద్దని విపక్ష నాయకులకు మంత్రి హితవు పలికారు.

సీపీఎస్‌పై చిత్తశుద్ధితో ఉన్నాం..
సీపీఎస్‌ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఇదే విషయంపై 2019 ఆగస్టులో మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం జగన్‌ ఏర్పాటు చేశారన్నారు. అందులో తాను కూడా ఉన్నానని, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు భేటీ కూడా అయ్యామని తెలిపారు. సీఎస్‌ అడ్వైజరీగా ఉండే ‘వర్కింగ్‌ కమిటీ ఆఫ్‌ సెక్రటరీస్‌’ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20 తేదీన జగనన్న అమ్మ ఒడి తుది జాబితా ప్రకటిస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామన్నారు.

ఉద్యోగులపై లాఠీచార్జి చేయించిన ఘనత చంద్రబాబుదే..
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరిన ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి వెళ్లి అరెస్టు చేశారని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు వీడియోలను మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అడిగిన ఉద్యోగులపై లాఠీచార్జీ చేయించడం, గుర్రాలతో తొక్కించడం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆయన హయాంలో అన్నీ అక్రమ బదిలీలేనని, అలాంటి వ్యక్తి ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సురేష్‌ ఎద్దేవా చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top