జువ్వలదిన్నె బోట్ల వివాదంలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు హస్తం
తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోన్ ‘కాల్ రికార్డు డేటా’
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే... స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రే మాయం చేసిన ఘనులు కూటమి నేతలేనని తేలిపోయింది. ముఖ్యంగా ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లూ బుకాయించిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అసలు సూత్రధారి అని స్పష్టమైంది. బోట్ల మాయం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు.
ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో బీద అనుచరులు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్లు వదిలేశారనే విషయం ఫోన్ ‘కాల్ రికార్డ్స్ డేటా’ ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పొట్టగొడుతున్నారని, న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే, వారిని ఏమార్చి, వారి నాయకులను కొనేసి, ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన బాగోతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది.

బీదా... ఇప్పుడేమంటారు?
బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కు రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలను వెల్లడించింది. బీద మస్తాన్‌రావుతోపాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయం వ్యవహారంలో నిందితులతోనూ, బోట్ల యజమానులతోనూ మాట్లాడినట్లు కాల్ డేటా బయటపెట్టింది.
⇒ ఎంపీ బీద మస్తాన్ అనుచరుడు, బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పోలిశెట్టి అనే పాతపాళెంకు చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకువెళ్లిన బోట్ల యజమాని అశోక్‌తో ఫోన్‌లో గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పోలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. ఇలా ఇద్దరూ మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు.
⇒ అదే విధంగా బోట్ల మాయం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి తోటయ్య అనే వ్యక్తితో బీద మస్తాన్ అనుచరుడైన పోలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 9 వరకూ 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది.
⇒ ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్‌తో మాట్లాడారు. అది కూడా గతేడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీరిద్దరూ ఫోన్‌లో సంప్రదింపులు జరుపుకున్నారు.
⇒ అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీద మస్తాన్‌రావుతోనూ ఫోన్‌లో మాట్లాడినట్లు బయటపడింది. గతేడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఈ ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీల్లో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలనూ అప్ డేట్ చేస్తూ వచ్చారు.


