మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ర్యాంప్, టైల్స్‌ను జేసీబీతో తొలగిస్తున్న దృశ్యం
మాజీ మేయర్ పాకా సురేష్ పై కక్ష సాధింపు
ఎమ్మెల్యే చేతిలో పావుగా మారిన నగరపాలక సంస్థ అధికారులు
కడప కార్పొరేషన్: కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలను ఆమె తరచూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా గురువారం కడప నగరంలోని 47వ డివిజన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటిముందు ఇంటర్ లాకింగ్ టైల్స్ వేసి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
వెంటనే అడిషనల్ కమిషనర్ రాకేష్‌చంద్ర, టౌన్ ప్లానింగ్ అ«ధికారులు పాత తేదీతో స్థానికులు ఫిర్యాదు చేసినట్టు ఒక పత్రాన్ని సృష్టించి ఆగమేఘాలపై జేసీబీని రప్పించి మాజీ మేయర్ సురేష్ ఇంటిఎదుట ఉన్న ఇంటర్ లాకింగ్ టైల్స్, ర్యాంపును తొలగించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేసినందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డికి చెందిన షాపుల ఎదుట ఉన్న ర్యాంపులను జేసీబీతో తొలగింపజేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీ ఎదుట కాలువ ఉందన్న నెపంతో కాలేజీ ముందు వైపు ఉన్న తాపలను జేసీబీతో కూల్చివేయించారు.
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిముందు వేసుకున్న టైల్స్, ర్యాంపును తొలగించడం అన్యాయమని మాజీ మేయర్ పాకా సురేష్ సతీమణి రాధిక అన్నారు. చాలా ఏళ్లుగా ఇవి ఉన్నాయని, స్థానికులకుగానీ, ఈ దారి వెంట వెళ్లే వారికిగానీ ఇబ్బంది కలిగించలేదన్నారు. అయినప్పటికీ గ్రీవెన్ సెల్‌లో ఫిర్యాదు వచ్చిందంటూ జేసీబీ తెచ్చి కూల్చివేయడం దారుణమన్నారు.


