టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామా | TDP MLA Kotamreddy Sridhar Reddy new drama | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామా

Aug 30 2025 2:06 AM | Updated on Aug 30 2025 2:13 AM

TDP MLA Kotamreddy Sridhar Reddy new drama

పెరోల్‌ పాత్ర వ్యవహారం డైవర్షన్‌ కోసమేనా! 

కోటంరెడ్డి హత్యకు ప్లాన్‌ అంటూ వీడియోతో ప్రచారం

రౌడీమూకలను పెంచి పోషించిందే శ్రీధర్‌రెడ్డి  

హత్యకు ప్లాన్‌ చేసిన వ్యక్తికే పెరోల్‌ కోసం సిఫార్సు లెటర్‌ ఇస్తారా? 

అరుణ ఫోన్‌ సంభాషణల్లో ఎమ్మెల్యే బాగోతం బయట పడడంతో నయా కుట్ర  

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో

సాక్షి, అమరావతి: జీవిత ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు నగరం, రూరల్‌ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించిందే శ్రీధర్‌రెడ్డి అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు తెలిసిందే. శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇవ్వాలంటూ సిఫార్సు చేసి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్‌రెడ్డి ఆ బురద కడుక్కునేందుకు ఎవరికైనా సిఫార్సు లేఖ ఇవ్వడం సాధారణమే అంటూ తప్పించుకునే యత్నం చేశారు. 

తాజాగా తన హత్యకు రౌడీషీటర్లు కుట్ర చేస్తున్నారనే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయించి కొత్త డ్రామా ఆడుతూ, వైఎస్సార్‌సీపీ పైకి నెట్టివేసే కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన హత్యకు జీవిత ఖైదీ శ్రీకాంత్‌ సైన్యం కుట్ర పన్నారంటూ హడావుడి చేస్తుండడంతో నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఏదో రకంగా కొత్త డ్రామాలు ఆడడం కోటంరెడ్డి అలవాటు.. ఇది ఆ కోవలోనిదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

వీడియోలోని వారంతా ఎమ్మెల్యే బ్రదర్స్, రూప్‌కుమార్‌ అనుచరులే 
తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక అనుచరుడు జగదీ‹Ù, కోటంరెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి అనుచరుడు మహేశ్, నెల్లూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ ముఖ్య అనుచరుడు దార్ల వినిత్‌తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా కుట్ర చేస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీమూకల ద్వారానే నెల్లూరులో కోటంరెడ్డి సెటిల్‌మెంట్లు, దందాలు, రౌడీయిజాలు చేయించినట్లు ఇటీవల పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.  

శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారంలో కోటంరెడ్డి అండదండలున్నాయని వెలుగులోకి రావడం, అరుణ ఫోన్‌ సంభాషణల్లో నిగూఢ రహస్యాలు వెలుగులోకి వస్తుండడం, అన్నింట్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్‌మెంట్‌ దందాలు చేసినట్లు ఉండడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. 

రాష్ట్ర డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం డైవర్షన్‌లో భాగంగా రౌడీమూకలు హోటల్‌ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్‌ మీడియాలో లీకు చేయించారని తెలుస్తోంది. తద్వారా వైఎస్సార్‌సీపీకి అంట గట్టే యత్నాలను చూసి నెల్లూరు నగర వాసులు ఛీదరించుకుంటున్నారు.    

పెంచి పోషించిన వారే హత్య చేస్తారా? 
జీవిత ఖైదీ శ్రీకాంత్‌ ఆది నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడే. ఇటీవల అరుణ ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను  50 శాతం మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50 శాతం ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రేమిస్తున్నాడని వెల్లడించిన విషయం విదితమే. నెల్లూరు సెంట్రల్‌ జైల్లో కూడా శ్రీకాంత్‌కు సకల సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

పెరోల్‌ రద్దయిన తర్వాత కూడా ములాఖత్‌ ఇవ్వకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి ములాఖత్‌ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీమూకలు సైతం ఎమ్మెల్యే వీరవిధేయులు. ఆయన కనుసన్నల్లోనే వారు పని చేస్తున్న విషయం బహిరంగమే. ఎమ్మెల్యే కీలక అనుచరులూ వీరి ద్వారానే సెటిల్‌మెంట్లు చేయిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవల ఓ కార్పొరేటర్‌ భర్త సెటిల్‌మెంట్‌ చేసి రూ.కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారు. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యాయత్నాలు, ఇటీవల వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీషీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కనుసన్నల్లో పని చేసే వారే ఆయన్ను హత్యకు కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పోలీసులే తేల్చాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement