బరితెగించిన టీడీపీ నేతలు.. గుడి, బడి, ప్రభుత్వాఫీసుల్లో మహానాడు | TDP Mahanadu in temples, schools, and government offices | Sakshi
Sakshi News home page

బరితెగించిన టీడీపీ నేతలు.. గుడి, బడి, ప్రభుత్వాఫీసుల్లో మహానాడు

May 28 2026 5:52 AM | Updated on May 28 2026 5:54 AM

TDP Mahanadu in temples, schools, and government offices

విశాఖలో సచివాలయంలో మహానాడు నిర్వహణపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత కటుమూరి సతీష్‌ను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బరితెగించిన టీడీపీ నేతలు

బుచ్చెయ్యపేట/పెద్దపంజాణి/శ్రీరంగరాజపురం/కంచరపాలెం(విశాఖ)/సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే బరితెగింపుతో పవిత్రమైన ఆలయాలు.. ప్రభుత్వ భవనా లని చూడకుండా ఎక్కడపడితే అక్కడ మహానాడు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఏకాదశి రోజున భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టేశారు. భక్తులు మండపం నుంచి గుడిలోకి వెళ్లకుండా అడ్డంగా కుర్చీలు వేసి, ఏకంగా ఆలయం తలుపులు మూసివేశారు. స్వామి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఉంచి, భారీ స్క్రీన్‌ ఏర్పాటుచేసి సమావేశాన్ని నిర్వహించారు. కొందరు టీడీపీ నేతలు మద్యం సేవించి హాజరైనట్లు సమాచారం. అలాగే, ఇదే జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ యోగా భవనంలోనూ మహానాడు నిర్వహించారు. 

ఇక ప్రైవేట్‌ హాల్స్‌లో అయితే డబ్బులు కట్టాలన్న కక్కుర్తితో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ ఎంపీడీఓ కార్యాలయంలో కానిచ్చేశారు. ఎంపీడీఓ బాలాజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరుమాకులపల్లి గ్రామంలోని శ్రీ ఆరుమానిగంగమ్మ ఆలయ ప్రాంగణంలోనూ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నిండా జెండాలు, భారీ బ్యానర్లు, కటౌట్లు, ఏర్పాటుచేశారు. ఇది దేవాలయమా? లేక టీడీపీ కార్యాలయమా?’’ అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇదే జిల్లా గుడిపాలలో టీటీడీ కల్యాణమండపంలో, తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు ప్రభుత్వ పాఠశాలలోనూ నిర్వహించారు.

సచివాలయంలో మహానాడు.. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు
విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు కస్తూరినగర్‌లోని సచివాలయంలో కూడా మహానాడు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కటుమూరి సతీష్, కో–ఆప్షన్‌ సభ్యుడు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.

బద్వేలు మహానాడులో రికార్డు డ్యాన్స్‌  

బద్వేలులో రికార్డింగ్‌ డ్యాన్సులు..
మరోవైపు.. వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు బోర్‌కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి అమ్మా­యిలతో రికార్డింగ్‌ డ్యాన్సులను ఏర్పాటుచేశారు. ఇది చూసి పార్టీ సీనియర్‌ నాయకులు ముక్కున వేలేసుకున్నారు.   

పొదుపు పేరుతో మరింత దుబారా
మహానాడుకు తడిసిమోపెడు ఖర్చు చేయించిన చంద్రబాబు 
తెలుగుదేశం పార్టీ వర్చువల్‌ మహానాడుకు చంద్రబాబు అనుసరించిన తీరు మాటల్లో పొదుపు.. చేతల్లో తీవ్ర దుబారా కనిపించింది. ఇంత ఖర్చుచేసినా ఈ కార్యక్రమం పూర్తిగా అట్టర్‌ఫ్లాప్‌ అయినట్లు పార్టీ నేతలు వాపోతున్నారు. వర్చువల్‌ సమావేశమే అయినా దీనికి సాధారణంగా అయ్యే ఖర్చుకంటే నాలుగు రెట్లు ఎక్కువ అవడంతో పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కార్యకర్తలు అక్కడకు రావడానికి ఉత్సాహం చూపించలేదు. ఈ మహానాడులో పొదుపు కంటే దుబారా ఎక్కువైంది. ఖర్చు తగ్గించడానికే ఆన్‌లైన్‌లో పెట్టామని చెబుతున్న చంద్రబాబు మాటలకు.. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్లు, ఇతర హంగులకు ఎక్కడా పొంతన కనిపించలేదు. వాస్తవానికి.. ఒకే వేదికపై మహానాడు నిర్వహిస్తే ఒక భారీ వేదిక, జర్మన్‌ హ్యాంగర్‌ టెంట్లు, సౌండ్‌ సిస్టమ్స్, భారీ భోజనాలు ఉండేవి. అక్కడ ఖర్చంతా ఇద్దరు, ముగ్గురు బడా నేతలపైనే పడేది. ప్రస్తుత వర్చువల్‌ మహానాడులో మంగళగిరి పార్టీ కార్యాలయంలో వేసిన ఒక స్టూడియో ఖర్చు మాత్రమే అధిష్టానానిది. మిగిలిన అసలు ఖర్చంతా జిల్లాల్లోని 1,875 క్లస్టర్లలోని నేతల మీదకు నెట్టేశారు. 

అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువైంది.. 
క్లస్టర్లు అంటే నియోజకవర్గానికి కనీసం 7–10 వరకూ ఉంటాయి. ఉదా.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 8 క్లస్టర్లలోనూ విడివిడిగా టెంట్లు, కురీ్చలు, సౌండ్‌ బాక్సులు, ప్రతీచోటా ఒక భారీ ఎల్‌ఈడీ స్క్రీన్, దానికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్, స్థానికంగా తరలివచ్చే జనం కోసం విడివిడిగా భోజనాలన్నీ కలిపి తడిసిమోపెడైంది.   

ఒక్కో క్లస్టర్‌లో కనీసం రూ.10 లక్షల ఖర్చు.. 
మామూలుగా అయితే మహానాడు ఖర్చు మొత్తాన్ని పార్టీ నిధుల నుండి లేకపోతే పార్టీలోని బడా నేతలు భరించేవారు. కానీ, చంద్రబాబు డిజిటల్‌ డ్రామావల్ల యాప్‌ లింక్, ఆఫీస్‌ లైటింగ్, వేదిక ఖర్చు తప్ప ఆయనకు పెద్దగా ఖర్చు కాలేదు. 1,875 క్లస్టర్లలో మాత్రం విపరీతంగా ఖర్చయింది. సాధారణ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుండి జనాలను బస్సులు, వాహనాలు, రైళ్లలో తరలించడంవల్ల రవాణా ఖర్చు పెరిగేదని.. దీన్ని తగ్గించేశామని చంద్రబాబు సెలవిచ్చారు. అయితే, ఈ క్లస్టర్‌ కేంద్రాలకు జనాలను తరలించడానికి స్థానిక నేతలు వందలాది ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేట్‌ వాహనాలు వినియోగించారు. కనీసంగా ఒక్కో క్లస్టర్‌లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే, నేతలపైనే పడింది. వారు తమ నియోజకవర్గంలోని పలు కార్యాలయాలు, వ్యాపారులపై పడి వసూలుచేసినట్లు తెలుస్తోంది.  

రవాణా, టెంట్లు, జనాల తరలింపు మామూలే.. 
ఇక రవాణా, టెంట్లు, జనాల తరలింపు వంటివన్నీ తగ్గించి ఖర్చును నివారించడం వర్చువల్‌ సమావేశాల ఉద్దేశం. కార్యకర్తలు, నేతలు ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని మొబైల్స్‌లోనో, లాప్‌టాప్‌లలోనో చూసుకోవాలి. అలా కాకుండా మళ్లీ గ్రామాల్లో, మండలాల్లో టెంట్లు వేసి, మైకులు పెట్టి, వందల మందిని సమీకరించి, పెద్ద స్క్రీన్ల ముందు కూర్చోబెట్టడాన్ని ఏమనాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటే తప్ప పొదుపు ఏమాత్రం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది.  

బాబు సెల్ఫ్‌ డబ్బా కోసమే డిజిటల్‌ డ్రామా.. 
చంద్రబాబు తాను ఐటీ విజినరీనని చెప్పుకోవడానికి వర్చువల్‌ అనే పదం వాడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేదంతా పాత విధానమే. జనాన్ని తరలించడం, అదే టెంట్లు, అదే బిర్యానీ ప్యాకెట్లు అదే హడావుడి. కార్యకర్తలను తీసుకెళ్లి థియేటర్‌లో సినిమా చూపించినట్లు ఎల్‌ఈడీ స్క్రీన్ల ముందు కూర్చోబెట్టారు. అయినా వారు వెళ్లిపోవడంతో ఆపడానికి నానాపాట్లు పడ్డారు. చివరికి బద్వేలు నియోజకవర్గంలో అయితే ఏకంగా రికార్డింగ్‌ డ్యాన్సులు పెట్టి పరువు తీసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement