
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎల్లో గ్యాంగ్ కబ్జా
4.30 ఎకరాల్లో 75 సెంట్లు దురాక్రమణ
రూ.10 కోట్లకు పైగా విలువైన స్థలంలో పాగా
కంపచెట్లు తొలగించి చదును చేసి గ్రావెల్ తోలుతున్న వైనం
మంత్రి బీసీ కనుసన్నల్లోనే ఆక్రమణ జరుగుతోందని పట్టణంలో చర్చ
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీ స్థలాలు కనిపిస్తే ఖతం
సాక్షి ప్రతినిధి కర్నూలు: అధికారం ఉండగానే వీలైనంతగా దండుకోవాలన్నట్లుగా ఉంది టీడీపీ నేతల తీరు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు. కర్నూలు జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేందుకు పచ్చబ్యాచ్ పావులు కదుపుతుంటే, నంద్యాల జిల్లా బనగానపల్లిలో అయితే ఏకంగా వక్ఫ్‌బోర్డు స్థలానికే ఎసరు పెట్టేశారు. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ బాగోతం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకు పైగా విలువైన స్థలం కబ్జా చేయడం ఇప్పుడు పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది.
బనగానపల్లె పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడికాల్వ) పక్కన సర్వే నెంబర్ 132లో 12.66 ఎకరాలు ఉంది. సర్వే నంబర్ 132/2బీలో 5.11 ఎకరాలు, 132/3లో 4.30 ఎకరాలు, 132/2లో 3.24 ఎకరాలు ఉంది. ఇందులో కొంత ఎస్‌ఆర్‌బీసీకి వినియోగించారు. అయితే, సర్వే నంబర్ 132/3లోని 4.30 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇందులో కంపచెట్లు ఉన్నాయి. ఈ స్థలంపై టీడీపీ నేతల కన్నుపడింది. మూడ్రోజులుగా అక్కడ కంపచెట్లను జేసీబీలతో తొలగించి స్థలాన్ని చదును చేస్తున్నారు. గ్రావెల్ తోలి దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇలా కంపచెట్లు తొలగించి, చదును చేసి ఆక్రమించిన స్థలం 75 సెంట్లు ఉంటుందని సమాచారం.
అధికారంతో అప్పనంగా కొట్టేయాలని..
మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్న ఈ స్థలం సర్వే నంబర్‌ను రిజి్రస్టేషన్ శాఖలో విచారిస్తే అది వక్ఫ్ బోర్డు స్థలంగా తేలింది. రిజిస్ట్రేషన్ శాఖలో పైన పేర్కొన్న మూడు సర్వే నంబర్లలోని 12.66 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది. ఈ క్రమంలో వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఎలాంటి లీజుకు తీసుకోకుండా కబ్జాచేయడం చూస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పనంగా కొట్టేయాలన్న కుట్ర కన్పిస్తోంది.
స్థలం విలువ రూ.10 కోట్లుపైనే
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ ప్రాంతంలో సెంటు స్థలం విలువ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉంది. రూ.15 లక్షలు చొప్పున లెక్కించినా కబ్జా చేస్తున్న 75 సెంట్ల స్థలం విలువ రూ. 11.25 కోట్లు ఉంది. ఈ కబ్జా 75 సెంట్లతోనే ఆగుతారా? లేదా విడతల వారీగా మొత్తం 4.30 ఎకరాలు స్వాహాచేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మొత్తం 4.30 ఎకరాలు హస్తగతం చేసుకుంటే రూ.64 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాజేసినట్లే. ఈ స్థలాన్ని మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అనుచరులు చదునుచేసి అభివృద్ధి చేస్తున్నారు. అయితే, అనుచరులు కాదు.. మంత్రే కబ్జా చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి.. వక్ఫ్ బోర్డు భూములు, స్థలాలను ముస్లిం మైనార్టీల అవసరాలకు మాత్రమే వినియోగించాలి, కానీ, అసలు వక్ఫ్ బోర్డుకు సంబంధంలేకుండా, వారి అనుమతిలేకుండా కబ్జా చేయడం చూస్తే బీసీ గ్యాంగ్ ఏ స్థాయిలో అరాచకం చేస్తోందనేది స్పష్టమవుతోంది.
మా దృష్టికి వచ్చింది, ఫిర్యాదు చేశాం
బనగానపల్లిలో వక్ఫ్ బోర్డు స్థలంలో ముళ్లపొదలు తొలగించి కబ్జా చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచి్చంది. మొత్తం 4.30 ఎకరాల వక్ఫ్ స్థలం ఉంది. ఈ కబ్జాపై బనగానపల్లి తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై చర్యలు తీసుకుంటాం. – ఇమ్రాన్, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్