
క్వారీ వద్ద ఘర్షణ పడుతున్న దృశ్యం
బందార్లపల్లె గ్రామస్తులపై ఇనుపరాడ్లతో తెగబడిన గూండాలు
పచ్చని పొలాల మధ్య క్వారీ వద్దన్నందుకే ఘాతుకం
ఐదుగురికి గాయాలు.. తిరుపతి రుయాలో చికిత్స
వెదురుకుప్పం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చమాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్డుపడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ కండకావరం ప్రదర్శిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసుల సహకారంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో 20 మందికిపైగా రౌడీమూకలను దింపింది. వారు ఇనుపరాడ్లతో గ్రామస్తులపై దాడికి యతి్నంచారు. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ప్రతిఘటించారు.
అసలేం జరిగిందంటే..
గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొమరగుంట పంచాయతీ పరిధిలోని బందార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో ఎద్దల బండను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతిచ్చారు. రెండు నెలలుగా టీడీపీకి చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దల బండకు ఆనుకుని సుమారు 20 ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు.
గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో శనివారం కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పనులను అడ్డుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని గ్రామస్తులను బెదిరించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, ఫింఛన్లు కట్ చేస్తామంటూ పోలీసులే బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దలబండ వద్దకు వెళ్లారు.
గమనించిన క్వారీ యాజమాన్యం ఐదు వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వారు ఇనుప రాడ్లతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్షి్మ, ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంత్‌రెడ్డి, వరప్రసాద్‌లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎమ్మెల్యే థామస్ అండ చూసుకుని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.

గ్రామస్తులకు నారాయణస్వామి భరోసా
గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ సుకుమార్ ఉన్నారు.