
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వ్రస్తాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు.
ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువ్రస్తాలు తీసుకొచ్చారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగదని, సెలక్షన్ మాత్రమేనని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. గురువారం జిల్లాలోని పెనుమూరులో నిర్వహించిన మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ఉండదు. ఎన్నికలు జరిపించాలన్న చోట అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చూడండి. అప్పుడు ఏకగ్రీవంగా మనవాళ్లే ఎన్నికవుతారు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం. టీడీపీ అభ్యర్థులను భయపెడితే కాళ్లు, చేతులు తీసేందుకు సిద్ధంగా ఉండాలి. టీడీపీలో కొందరు వైఎస్సార్‌సీపీకి కోవర్టులుగా ఉన్నారు. వారిని ఒకచోట చేరిస్తే ఎండ్రకాయల్లా కొట్టుకుంటారు. అందుకే ఒక్కొక్కరిని ఏరి ఒక్కొక్క బొక్కలో పెడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.