
యూరియా కోసం క్యూల్లో గంటల తరబడి నిరీక్షణ
సాక్షి, అమరావతి/ఉదయగిరి రూరల్/గంగవరం/సదుం/మదనపల్లె రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానపల్లె పంచాయతీ బిజ్జంపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డుపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం, సదుం మండలాల్లో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు.
గంగవరంలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరిన 450 బస్తాలు యూరియా కోసం 2వేలమందికిపైగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు గాశారు. దీంతో ఉన్న 450 బస్తాలను ఇంతమందికి ఎలా పంచాలా అని అధికారులు తలలు పట్టుకున్నారు. పీఏసీఎస్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ రైతులు ఎండలో క్యూకట్టారు. వీరిలో వృద్దులు, మహిళలూ ఉన్నారు. అలాగే, సదుంలోని ఓ ప్రైవేటు దుకాణానికి 14 క్వింటాళ్ల యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు బారులు తీరారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మండల వ్యవసాయశాఖాధికారి(ఏవో) కార్యాలయంలో యూరియా కూపన్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కూపన్లు ఇస్తున్న క్రమంలో అక్కడ తోపులాటలు, అరుపులు, కేకలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గంటలసేపు నిల్చుని, తోపులాటకు గురై ఇబ్బందులు పడుతూ లోనికి వెళితే ఒకరికి ఒక బస్తా యూరియానే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుల డిమాండ్‌కు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు 22.12 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, దాంట్లో సగానికి పైగా వరి సాగైందని చెప్పారు. అదునుకు పంటకు యూరియా అందించకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెపె్టంబర్‌లో వరి చిరుపొట్టదశలో తప్పనిసరిగా యూరియా వేయాలని, దీనికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు.
సీజన్ ప్రారంభంలోనే వరి సాగు ఏరియాలో యూరియా కొరత వచ్చిందని, ఆగస్ట్ 8 నుంచి కురిసిన అధిక వర్షాలతో ముంపునకు గురైన వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకూ యూరియా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా యూరియా కోసం రైతులు బారులు తీరి కన్పిస్తున్నారన్నారు.
రెండో పంటకు యూరియా కొనవద్దని ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. రూ.266.5 ఉన్న యూరియా కట్టను కొనాలంటే ప్రైవేటు వ్యాపారులు రూ.1,400పైగా ఉన్న కాంప్లెక్స్ కట్ట లేదా రూ.800– 900 పలికే పురుగు మందును బలవంతంగా అంటకడుతున్నారని నాగిరెడ్డి చెప్పారు.