మత్స్యకారుల ఐక్యతను దెబ్బతీసేందుకు టీడీపీ కుట్ర

TDP conspiracy to undermine fishermen unity - Sakshi

వైఎస్సార్‌సీపీ నేతలను కలవరాదని ఓ వర్గం ఆదేశం

కలిస్తే తప్పేంటని మరో వర్గం వాదన

రసాభాసగా మత్స్యకారుల రౌండ్‌టేబుల్‌ సమావేశం

తిరుపతి అర్బన్‌: మత్స్యకారుల ఐక్యతను దెబ్బతీసేందుకు టీడీపీ కుట్రపన్నింది. వైఎస్సార్‌సీపీ నేతలను కలవకూడదని ఓ వర్గం చెప్పగా.. సమస్యల పరిష్కారం కోసం కలిస్తే తప్పేంటని మరో వర్గం వాదనకు దిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల రౌండ్‌టేబుల్‌ సమావేశం రసాభాసగా మారింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి యూత్‌ హాస్టల్‌ సమావేశ భవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల రౌండ్‌టేబుల్‌ సమావేశం జేఏసీ కన్వీనర్‌ సత్యనారాయణ నేతృత్వంలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే కొండబాబు మత్స్యకారులకు చంద్రబాబు పాలనలోనే న్యాయం జరిగినట్లు చెప్పే ప్రయత్నం చేశారు.

కొందరు టీటీపీ మద్దతుదారులు వైఎస్సార్‌సీపీ నాయకులకు మత్స్యకారుల సమస్యలు చెప్పవద్దని, అసలు వారిని కలవకూడదని అనడం వివాదానికి దారితీసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నందున, ఏంచేయాలన్నా వాళ్లను కలవాల్సి ఉంటుందని.. సమస్యల పరిష్కారం కోసం వారిని కలిస్తే తప్పేంటని నిలదీశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రస్థాయి సమావేశం తిరుపతిలో నిర్వహించనున్న దృష్ట్యా మత్స్యకారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఇందులో టీడీపీ నేతలు ఇతర విషయాలను చర్చించడం ఏమిటని వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల నడుమ పలువురు మత్స్యకారులు సమావేశంలో పాల్గొనకుండా ఆవరణలోనే ఉండిపోయారు. సమావేశం రసాభాసగా మారడంతో ఎవరికీ సర్దిచెప్పలేక కొల్లు రవీంద్ర మౌనం దాల్చారు. కొంతసేపటికి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top