స్పీకర్‌పై వ్యాఖ్యలకు అచ్చెన్న విచారం  | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై వ్యాఖ్యలకు అచ్చెన్న విచారం 

Published Wed, Sep 15 2021 3:29 AM

TDP Atchannaidu Attended Before the Assembly Privilege Committee - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపింది. గతంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకురాగా ప్రివిలేజ్‌ కమిటీ అభ్యంతరం తెలిపింది. కమిటీ ముందు హాజరైన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ తనను విచారణకు పిలిచారని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల గతంలో రాలేకపోయానని తెలిపానన్నారు.

ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. దానికి సంబంధించిన అంశంపై వివరణ ఇచ్చానన్నారు. స్పీకర్‌ స్థానంపై తనకి గౌరవం ఉందని చెప్పారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను, ఆ తర్వాతే స్పీకర్‌నని గతంలో తమ్మినేని సీతారాం అన్నారని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ అంశం కోర్టులో ఉన్నా తమ్మినేని.. చంద్రబాబును విమర్శించారన్నారు. తనకు చట్టంపైన, వ్యవస్థలపైన నమ్మకం ఉందని చెప్పారు. తన వివరణతో కమిటీ సంతృప్తి చెందిందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో చిన్న అప్పలనాయుడు మినహా మిగతా సభ్యులంతా పాల్గొన్నారు.  

అచ్చెన్నాయుడు పొరపాటు జరిగిందన్నారు 
స్పీకర్‌ తమ్మినేనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అచ్చెన్నాయుడు మళ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదని కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడిని వ్యక్తిగతంగా ఒకసారి పిలిచామన్నారు. అన్ని అంశాలపై ఆయన సమధానమిచ్చారన్నారు. పొరపాటు జరిగిందని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని, విచారం వెలిబుచ్చుతున్నాననని అచ్చెన్నాయుడు చెప్పారని తెలిపారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ప్రెస్‌నోట్‌ పొరపాటున బయటకు వెళ్లిందని కూడా తెలిపారని చెప్పారు. అచ్చెన్నాయుడి వివరణను కమిటీ సభ్యులందరికీ పంపిస్తామని, వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ గతంలో విచారణకు హాజరుకాలేదని, మరుసటిరోజు ఫోన్‌చేసి అందుబాటులో లేనందువల్ల నోటీసు అందుకోలేకపోయానని చెప్పారని తెలిపారు. మరో అవకాశం ఇస్తే వస్తానని చెప్పారన్నారు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, రామానాయుడుకు ఇప్పటికే నోటీసులు జారీచేశామని చెప్పారు. నిమ్మగడ్డ ప్రివిలేజ్‌ కమిటీ పరిధిలోకి వస్తారని సమాచారం పంపామన్నారు. ఈ నెల 21న మరోసారి సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న అంశాలను క్లియర్‌ చేస్తామని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి వాటిమీద స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరిపే ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి ఫిర్యాదుపై చర్చిస్తామని కాకాణి చెప్పారు.   

Advertisement
Advertisement