యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్‌లో..

TDP Activist Son Misbehave with Young Woman in Kanteru Village - Sakshi

అనుచరులతో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పోలీస్‌స్టేషన్‌కు..    

చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించి స్టేషన్‌ ముందు బైఠాయింపు   

ఇరువర్గాలకు నచ్చజెప్పిన గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ 

కంతేరు(తాడికొండ): తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ కార్యకర్త కర్లపూడి వెంకాయమ్మ కొడుకు వంశీ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య రెండురోజులుగా వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం వెంకాయమ్మ, ఆమె కొడుకు వంశీ ఆ యువతి కుటుంబ సభ్యులపై తిట్లదండకం అందుకున్నారు. దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణగా యువతి కుటుంబ సభ్యులు ఎదురుదాడికి యత్నించారు. దీంతో రాజకీయ రంగు పులిమేందుకు టీడీపీ నేతలు యత్నించారు.

వైఎస్సార్‌ సీపీ నేతలు దాడి చేశారంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలూ ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడినట్టు చెబుతున్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు ఒక్కొక్కరిగా టీడీపీ నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ దుర్గా ప్రసాద్, ఎస్‌ఐ వెంకటాద్రితో వాగ్వివాదానికి దిగారు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నా పట్టించుకోకుండా వెంకాయమ్మ కొడుకుపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ వాదనకు దిగారు.

చదవండి: (ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! )

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్‌ కలిపి వెంకాయమ్మతో మాట్లాడించి ఎల్లో మీడియా ఎదుట లేనిది ఉన్నట్లు సృష్టించే యత్నం చేశారు. బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి వత్తాసు పలుకుతారా.. అంటూ టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఓ దశలో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలకూ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top