ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి 

Suspicious Death of Nandavaram youth in Kuwait - Sakshi

కువైట్‌లో నందవరం యువకుడి అనుమానాస్పద మృతి 

సాక్షి, మర్రిపాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మండలంలోని నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాలు.. నందవరం గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి – జానీబేగం దంపతుల 3వ కుమారుడు షేక్‌ ఖాజాగరీబ్‌ నవాజ్‌(22) కువైట్‌లోని ఫెర్దోస్‌ పట్టణంలో ఉన్న గ్రేన్‌ కోసుర్‌ ఏరియాలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి)

రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లిన నవాజ్‌ అక్కడ ఇళ్లలో పూల మొక్కల పెంపకం పనులు చేసుకుంటూ సంపాదించిన నగదును ఇంటికి పంపుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. తరచూ ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడే నవాజ్‌ మంగళవారం కూడా వారితో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం అతను ఉంటున్న ఇంటి సమీపంలో రేకుల షెడ్‌లో నవాజ్‌ ఉరేసుకుని మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

నవాజ్‌తోపాటు అక్కడ పనుల కోసం వెళ్లిన మరికొంతమంది ఈ విషయం తెలియజేశారు. అందరూ నిద్రపోయిన తరువాత నవాజ్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాస్పదంగా ఉందంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవాజ్‌ మృతదేహానికి అక్కడే గురువారం పోస్టుమార్టం నిర్వహించారని, శనివారానికి మృతదేహం స్వగ్రామానికి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నవాజ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top