మావోయిస్టులకు పరికరాలు, డబ్బు, బంగారం సరఫరా వ్యవహారం
2014–19 మధ్య టీడీపీ అనుకూల బడా కాంట్రాక్టర్ నిర్వాకం
ఆ చర్యతో గిరిజనులు, సామాన్య పోలీసులు హతం
సమగ్ర విచారణకు సుముఖత చూపని చంద్రబాబు ప్రభుత్వం
కాంట్రాక్టర్‌కు అండగా నిలిచిన టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి
సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయకుండా కాలయాపన
పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం
‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఓ అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ, ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు.
సాక్షి, అమరావతి : ‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం.. సమగ్ర విచారణ లేకుండా కనికట్టు చేస్తాం.. అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతోంది. ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టులే గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొందరు పోలీసులను హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశ పూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.
ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైనా ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ లేకుండా విషయాన్ని కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇలా ఉంది.
ఏవోబీలో మావోయిస్టులకు కీలక పరికరాలు, నిధులు
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్టు సంస్థకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్టు పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో ఆయన మావోయిస్టులకు భారీగా నిధులు సమకూర్చడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) వర్గాలు గుర్తించాయి.
ఎస్‌ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలీ కమ్యూనికేషన్ పరికరాలు (నిఘా పరికరాలు), బంగారం, నగదు, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్టు విచారణలో వెల్లడైంది.
ఎన్నో ఏళ్లుగా ఆ కాంట్రాక్టు్ట సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌ను అరెస్టు చేశారు. దేశ ద్రోహ నేరంగా యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం, టెలీగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సహయం అందిస్తోంది.. మావోయిస్టులను ఏఏ ప్రాంతాల్లో కలుస్తున్నది.. ఈవ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులెవరనేది గుర్తిస్తారని అంతా భావించారు.
కుట్రతో కేసును నీరుగార్చిన అధికారి
⇒ సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగ ప్రవేశం చేశారు. టీడీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ కేసులో బడా కాంట్రాక్టు సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కు అయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే, బరితెగించి పక్కాగా కేసును నీరుగార్చేందుకు కథ నడిపారు.
⇒ నిబంధనల ప్రకారం సంఘటన స్థలంలో అరెస్టు అయిన కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌నే కాకుండా నిధులు అందించిన కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే యజమాని ఇచ్చిన నిధులు, పరికరాలనే మేనేజర్ మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం కేవలం మేనేజర్‌పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టు సంస్థ యజమానిని కనీసం పిలిచి విచారించనూ లేదు.
⇒ యూఏపీఏ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. చార్జ్‌షిట్ దాఖలు చేయాలి. కానీ ఐపీఎస్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో తాను చెప్పింది చెప్పినట్టు చేసే ఓ సీఐకి విచారణ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో చార్జ్‌షిట్ దాఖలు చేయించారు.
⇒ యూఏపీఏ కేసులను జిల్లా కేంద్రంలోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం విచారించాలి. కానీ ఐపీఎస్ అధికారి ఆ కేసును అరకు న్యాయస్థానంలో విచారణకు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కూడా పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు.
⇒ఈ నేపథ్యంలో దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరం కేసులో కూడా నిందితులను న్యాయస్థానం విడిచిపెట్టింది. పైగా అరకు న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ఆ బడా కాంట్రాక్టర్ తమకు అస్మదీయుడు కావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చూసీ
చూడనట్టు వదిలేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సమగ్ర విచారణకు ఆదేశం
⇒ 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు విషయం బయటపడింది. ఆ కాంట్రాక్టు సంస్థ సమకూర్చిన నిధులతోనే 2018లో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి బృందం అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారని కూడా గుర్తించింది. ఎంతో మంది పోలీసులను హతమార్చడానికి కూడా ఆ నిధులనే వాడుకున్నారని వెల్లడైంది. దేశ ద్రోహానికి పాల్పడిన కేసులో నిందితులకు పోలీసులు అండగా నిలవడం ఏమిటని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
⇒ ఫలితంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లా ఎస్పీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నంలోని ఏడీజే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించింది.
⇒ దాంతో బడా కాంట్రాక్టరు, ఐపీఎస్ అధికారి (ఆయన అప్పటికి అమరావతికి బదిలీ అయ్యారు) బెంబేలెత్తారు. కేసు సమగ్రంగా విచారిస్తే ఇద్దరి బాగోతం బయట పడుతుందని ఆందోళన చెందారు. అందుకే విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత కథే
⇒ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పోలీసు శాఖ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బడా కాంట్రాక్టర్, అవినీతి ఐపీఎస్ అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. ఇక ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తూ బరితెగించి ‘అవినీతి అనకొండ’గా చెలరేగిపోతున్నారు.
⇒ ఈ కేసును సమగ్రంగా విచారిస్తే వారిద్దరి బాగోతం బయట పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పోలీసు శాఖలో కొందరు సూచించారు.
⇒ హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లో ఏఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలి. లేకపోతే ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే శాశ్వతంగా మూసి వేసినట్టు అవుతుంది.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలిపోతుంది.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఇతర కుటుంబాలను అవమానించినట్టు అవుతుందని వారు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం మాత్రం సుముఖంగా స్పందించలేదని తెలుస్తోంది.
⇒ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసేందుకు ఏఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా 90 రోజుల గడువు ముగిసేలా చేయాలన్నదే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం, ఏఎస్‌ఆర్ జిల్లా పోలీసుల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్, రెడ్‌బుక్ వేధింపులకు అండగా నిలుస్తున్న అవినీతి ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా దేశద్రోహం కేసునే అడ్డగోలుగా మూసి వేసేందుకు బరితెగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.


