జవాన్‌ జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత

Sucharita Give 50 lakh Exgratia To Jawans Jaswanth Family - Sakshi

సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ జస్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందించారు.

తర్వాత హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. జస్వంత్‌రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకమని, అతి చిన్న వయసులోనే అతను మరణించటం బాధాకరమన్నారు.  దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదని కొనియాడారు.  దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన అతని తల్లిదండ్రుల జన్మ చరితార్థమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని, ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ప్రకటించిన రూ. 50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, దానిపై సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన జస్వంత్ రెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశం కోసం జస్వంత్ రెడ్డి ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందదని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top