 
													సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలైంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లోని ఐబీ స్కూళ్లలో సిలబస్ అమలును పాఠశాల విద్యా శాఖ పరిశీలించింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ రెండేళ్లుగా అమలవుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం అక్కడి పాఠశాలలను పరిశీలించింది.
ఐబీ సిలబస్ బోధిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాలు, విద్యార్థులకు బోధిస్తున్న విధానంపై అధ్యయనం చేసింది. ఏపీలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయుల శిక్షణ, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఆవశ్యకతను అర్థం చేసుకునేందుకు, విధివిధానాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వెస్ట్ వినోద్‌నగర్‌లోని సర్వోదయ కన్య విద్యాలయ (ఎస్‌కేవీ)ను వీరు సందర్శించారు. ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై వివిధ అంశాలపై మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, ఐబీ సిలబస్ అమలుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవల స్టీరింగ్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆ కమిటీ ఢిల్లీ స్కూళ్లను పరిశీలించింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
