
రామకుప్పం, శాంతిపురం మండలాల్లో 2,139 ఎకరాల సేకరణ!
తొలుత కార్గో ఎయిర్‌పోర్ట్, తర్వాత ఎయిస్ట్రిప్, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్
దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను మించిన వైనం
ఎకరాకు రూ.16 లక్షల పరిహారం... మార్కెట్ రేటు కనీసం రూ.20 లక్షలు
రోడ్డు పక్కన ఎకరం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.కోటిపైనే
సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అరణ్య రోదనగా రైతుల ఆవేదన
శాంతిపురం: సీఎం చంద్రబాబును నలబై ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న కుప్పం నియోజకవర్గంలోని రైతుల గోడు అరణ్య రోదనే అవుతోంది. విమానాశ్రయం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పంట భూములు తీసుకునే ప్రయత్నం చేస్తుండడంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం రామకుప్పం, శాంతిపురం మండలాల సరిహద్దుల్లో ఏకంగా 2,139.47 ఎకరాలను సేకరిస్తోంది. దీనికోసం పెద్దల డైరెక్షన్‌లో అధికారులు రైతులను బెదిరించి భూములు తీసుకొంటున్నారు.
‘‘మంచిగా ఇస్తే సరి.. ఎకరాకు రూ 16 లక్షలు పరిహారం వస్తుంది. అడ్డంపడితే రూ.10 లక్షల వంతున డిపాజిట్ చేసి భూములు తీసుకుంటాం’’ అని గదమాయిస్తున్నారు. కాదని కోర్టుకు వెళ్తే చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తీసుకుంటామని హెచ్చరిస్తుండడం గమనార్హం. కొందరు రైతులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసుకున్నారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకున్నా... తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ముందుకొచ్చారు. ప్రాణాలు పోయినా భూమి వదులుకునేది లేదని మరికొందరు రైతులు తెగేసి చెబుతున్నారు.
90 నిమిషాల్లోపే బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కుప్పంకు వంద కిలోమీటర్ల లోపే ఉంది. దీనికి చేరేందుకు నాణ్యమైన రోడ్డు రవాణా ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు సూచిస్తున్నారు. ఇప్పటికే పాక్షికంగా పూర్తయిన చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వేతో నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి 60 నుంచి 90 నిమిషాల్లో కెంపేగౌడ విమానాశ్రయం చేరుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కుప్పంలో విమానాశ్రయం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక భారాన్ని మోస్తూ ఎంతమంది స్థానికులు రాకపోకలు సాగించగలరని నిలదీస్తున్నారు. బెంగళూరుకు డబుల్ డెక్కర్‌లో వెళ్లాలంటే రూ.315 చార్జీ అని, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో రూ.50, రూ.25తో వెళ్లొచ్చని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో 95 శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారని చెబుతున్నారు.
ఎయిస్ట్రిప్ నుంచి
ఎయిర్‌పోర్ట్ కుప్పంలో తొలుత ఎయిర్‌్రస్టిప్ నిర్మాణానికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం 558.64 ఎకరాల సేకరణకు దిగింది. రామకుప్పం మండలంలో 496.24 ఎకరాలు, శాంతిపురం మండలంలో 62.40 ఎకరాలను తీసుకునేందుకు 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇ చ్చింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చారు. అంతకుముందే రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా టైడిల్ సిల్క్ పరిశ్రమ కోసం అంటూ 30సొన్నేగానిపల్లి, అమ్మవారిపేట రెవెన్యూలలో దాదాపు 175 ఎకరాలను లాక్కుని రికార్డులలో ప్రభుత్వ భూమిగా మార్చారు.
అయితే, ఇప్పటికీ సాగు వదలని ఇక్కడి రైతులు న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఎయిర్‌్రస్టిప్‌నకు బదులు ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని అధికార యంత్రాంగం ప్రకటించింది. రామకుప్పం మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,021.765 ఎకరాలు, శాంతిపురం మండలం మూడు రెవెన్యూ గ్రామాల నుంచి 384.074 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది గతంలో తీసుకున్న 558.64 ఎకరాలకు అదనం. టైడిల్ సిల్‌్కకు తీసుకున్న 175 ఎకరాలనూ ఎయిర్‌పోర్ట్ కోసమే వాడనున్నారు. కొత్త భూ సేకరణకు పయ్రత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు, అలాంటిది ఏమీ లేదని అధికారులు అంటున్నారు.
విమానాశ్రయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రైతులు సహకరించాలని ఓ వర్గం ప్రజలు కోరుతుండగా.. భూములు కోల్పోయే రైతు కుటుంబాలు, వారి బంధుమిత్రులు వాదన మరో రకంగా ఉంది. పోయేది తమ భూములని.. వేరేవారికి ఆ బాధ ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతగా కావాలంటే విమానాశ్రయాన్ని ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతున్నారు. కుదరదంటే పరిమిత విస్తీర్ణంలో మాత్రమే పంట భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకింత భూమి..?
కుప్పంలో చిన్న ఎయిర్ పోర్ట్ నిర్మాణానికే ప్రభుత్వం వేల ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నదో చిదంబర రహస్యంగా మారింది. ఇక్కడికి నిత్యం ఎన్ని విమానాలు వస్తాయి? ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు? సరుకు రవాణా ఏ మేరకు సాగుతుంది? వీటిపై అంచనాలు లేకుండా అనవసరంగా రైతులను భూముల నుంచి వెళ్లగొడుతున్నారు. నిజంగా విమానాశ్రయానికి కావాలంటే తిమ్మరాజుపల్లి సమీపంలో అటవీ భూములు ఉన్నాయి. – చక్రపాణిరెడ్డి, బాధిత రైతు, దండికుప్పం
బలవంతపు సేకరణ వద్దు
ప్రభుత్వం ఎన్ని నీతులు చెబుతున్నా కుప్పం విమానాశ్రయం కోసం సాగుతున్నది బలవంతపు భూ సేకరణే. అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు ఇచ్చేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. కొండలు, బంజరును అభివృద్ధి చేసుకుని రైతులు తరతరాలుగా సాగు చేస్తుంటే... ఇప్పుడు వారిని గెంటివేస్తున్నారు. నేలను నమ్ముకున్న రైతుకు కావాల్సింది పరిహారం కాదు.. సాగుకు భూమి. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేయాలి. – ఓబులరాజు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి