గ్రామాల్లో మొదలైన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో మొదలైన ఆస్తుల రిజిస్ట్రేషన్‌

Published Thu, Jun 29 2023 4:13 AM

Started Registrations of properties in villages  - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు అను­కూలంగా పరిపాలనను మండలం నుంచి గ్రామ స్థాయికి తీసుకువచ్చిన ప్రభు­త్వం.. దాన్ని మరింత మెరుగుపరిచేలా రిజిస్ట్రేషన్ల సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. భూముల రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్‌ సేవలు లాంఛనంగా ప్రారంభమ­య్యాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. తమ గ్రామా­ల్లోని సచివాల­యాలకు వెళితే అక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యాల్లో ఉండే అన్ని సేవలు పొందవచ్చు.

సుపరి­పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి­ష్టా­త్మ­కంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వ­హి­స్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశల్లోనూ పూర్తయి అక్కడ డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవల్ని ప్రారంభించాలని గతంలోనే ప్రభుత్వం విధాన­పరమైన నిర్ణ­యం తీసుకుంది.

అందుకోసం మొదట ప్రయో­గా­­­త్మకంగా రీసర్వే పూర్తి చేసిన 51 గ్రామ సచివాల­యాలను గత సంవత్సరం జనవరిలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యాలుగా గుర్తించి అక్కడి పంచాయతీ కార్యదర్శు­లను జాయింట్‌ సబ్‌ రిజి­స్ట్రార్లుగా నియమించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో 1,949 సచివాలయాలు, ఈ నెల 23న మరో 195 సచివాలయాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా­లయా­లుగా గుర్తించింది. వీటిలో రీసర్వే పూర్త­యిన 2 వేల గ్రామా­లను 1,535 గ్రామ సచివాల­యాలుగా మ్యాపింగ్‌ చేసి అక్కడ రిజిస్ట్రేషన్‌ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు.

సీఎం దిశా నిర్దేశం.. ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు పూర్తి స్థాయిలో మొదలు కావాలని ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఈ నెలాఖరు నాటికి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. దీంతో ఈ 15 రోజుల్లోనే దాదాపు అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్‌ సేవలు ఊపందు­కున్నాయి.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందించే సర్టిఫైడ్‌ కాపీ, ఈసీ సర్టిఫికెట్, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ జారీ సహా డాక్యుమెంట్ల రిజి­స్ట్రేషన్‌ను మొదలు­పెట్టారు. ఇప్పటివరకు 4,300కి­పైగా రిజి­స్ట్రేషన్లను సచివాల­యాల్లో చేశారు. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.7.67 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని 44 గ్రామ సచివాలయాల్లో 766 రిజిస్ట్రేషన్లు జరి­గాయి.

ఈ 2 వేల గ్రామాలకు సంబంధించి సచి­వాలయాల ద్వారా 16 లక్షల ఈసీలు, 62 లక్షల సర్టిఫైడ్‌ కాపీలు జారీ చేశారు. ఈ సేవల్ని మరింత విస్తృతంగా సచివాలయాల నుంచి అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్ని­స్తోంది. ప్రతిష్టాత్మ­కంగా ప్రారంభించిన ఈ సేవల గురించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రజల ముంగిటకే రిజిస్ట్రేషన్‌ సేవలు 
ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లే విధానాన్ని రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ప్రవేశపెట్టాం. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన గ్రామ సచివా­లయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ప్రజలు ఈ సర్వీ­సుల్ని వినియోగించుకోవాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా­లయాలతో పాటు ఎవరి గ్రామాల్లో వారు ఈ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయడం కోసం ఆయా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం.  – వి రామకృష్ణ, కమిషనర్‌ అండ్‌ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.

Advertisement
Advertisement