ప్రకృతి ఒడిలోవైదిక గ్రామం.. హైటెక్‌ యుగంలో ప్రాచీన జీవన విధానం

Srikakulam District: Vedic Village Srikurma Gramam Special story - Sakshi

అక్కడ రాజు.. కూలీ ఉండరు

పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం అక్కడ సాక్షాత్కారం

సనాతన ధార్మిక జీవన విధానం వారి సొంతం

ప్రకృతి ఒడిలో సహజసిద్ధ జీవితం

ఒత్తిడి, టెక్నాలజీకి దూరంగా జీవనం

అక్కడ సెల్‌ఫోన్‌ నోటిఫికేషన్లు.. రింగ్‌టోన్‌ సౌండ్లు వినిపించవు.. టీవీలూ కనిపించవు. కానీ.. సకల చరాచర సృష్టిలో జీవులు ఉద్భవించడం నుంచి.. అస్తమించడం వరకూ విశ్వ సమాచారమంతా అక్కడి వారికి తెలుసు. మిక్సీలు.. వాషింగ్‌ మెషిన్లు వంటి హంగులేవీ కనిపించవు. కానీ.. పనులన్నీ చకచకా సాగిపోతాయి. అక్కడ విద్యుత్‌ లేదు. కానీ.. ఆ గ్రామస్తుల ఆలోచనల్లో చైతన్య కాంతి ప్రసరిస్తుంటుంది. అక్కడ వ్యాపారులు, కొనుగోలుదారులు ఎవరూ ఉండరు. అక్కడ రాజు.. కూలీ అనే వాళ్లెవరూ ఉండరు. అందరూ కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందుతారు. తాము పండించిన వడ్లను దంచుకోగా వచ్చిన బియ్యాన్ని వండుకుతింటారు. కావాల్సిన దుస్తుల్ని సైతం స్వయంగా నేసుకుంటారు. అక్కడి ఇళ్లు కూడా గానుగలో ఆడించిన సున్నంతో వారు స్వయంగా కట్టుకున్నవే. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ప్రత్యేకతలకు నెలవైన ఆ ఊరి పేరు కూర్మ. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం అంతకాపల్లి కొండల మధ్య కొలువై ఉండే ఆ గ్రామంలోకి అడుగు పెడితే...

సాక్షి, శ్రీకాకుళం/హిరమండలం: చుట్టూ పచ్చని కొండలు.. అందమైన ప్రకృతి. అంతేకాదు!!. ఆధునిక పద్ధతులకు దూరంగా.. సనాతన ధర్మమే వేదంగా.. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు కూర్మ గ్రామం కూడా అక్కడే ఉంది. స్వచ్ఛమైన, పురాతన గ్రామీణ భారతీయ జీవన శైలిని అనుసరిస్తూ.. అదే మానవాళికి శ్రేయస్కరమని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ గ్రామస్తులు. ఒత్తిళ్లతో కూడిన ఆధునిక యాంత్రిక యుగంలోనూ సనాతన ధార్మిక జీవన విధానాన్ని ఎలా సాగించవచ్చో చూపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కూర్మ గ్రామం విశేషాలేంటంటే...

పర్యాటక గ్రామంగా..
జిల్లాలో ప్రస్తుతం అతి ఎక్కువగా పర్యాటకులు సందర్శిస్తున్న గ్రామంగా కూర్మ రికార్డులోకి ఎక్కింది. గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇక్కడికొచ్చి వీరి పద్ధతులను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇక్కడే ఉండిపోవాలని భావిస్తున్నారు కూడా. ఇక్కడ కృష్ణతత్వం, వేదం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవడానికి విదేశీయులు సైతం వస్తున్నారు. రష్యా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడే ఉండిపోవటం విశేషం.

ఇదే కూర్మ గ్రామం
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో హిరమండలం మండల పరిధిలోని అంతకా­పల్లి సమీపంలో కొండల మధ్య సరికొత్తగా కొలు­వు­దీరిన గ్రామమే కూర్మ. ప్రాచీన భారతీయ గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు, వృత్తులు.. తదితరాలన్నీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. 2018లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌) సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత­స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఈ గ్రామాన్ని నిర్మించారు. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 12 కుటుంబాలు.. 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులతో కలిసి 56 మంది ఉంటున్నారు.

వీరంతా ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్నశ్రేణి జీవనాన్ని అనుభవించినవారే. కానీ.. జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా సరికొత్త జీవన విధానాన్ని ఇక్కడ అనుసరిస్తు­న్నారు. చాలామంది రూ.లక్షల్లో జీతాలిచ్చే కొలువులు వదులుకుని వచ్చేశారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన త్రిభంగా నందదాస్, బీటెక్‌ చదివిన రాధాకృష్ణ చరణ్‌దాస్, రాధ గిరిదర్‌ దాస్, బీకాం చేసిన మదన్‌మోహన్‌ గిరిధర్‌ దాస్, కృష్ణ ప్రేమ్‌దాస్, పీహెచ్‌డీ చేసిన జయ హరిదాస్‌ వంటి చాలా మంది... కార్లు, బంగ్లాలు వదిలి కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్నారు.

ఇళ్లు కూడా వారే కట్టారు
ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి.. గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో స్వయంగా వారే ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు 13 ఇళ్లు, 4 వసతి గృహాలు, వర్ణాశ్రమ కళాశాల నిర్మించుకున్నారు. నిర్మాణంలో సిమెంట్, ఇనుము ఎక్కడా వాడలేదు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుకుతారు. ప్రకృతి నుంచి లభించే పదార్థాలనే ఉపయోగిస్తున్నారు. కరెంటు వాడరు. సెల్‌ఫోన్లు లేవు.  ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, మిక్సీలు వంటివేవీ లేవు. ఇళ్లల్లో కనీసం లైట్లు, ఫ్యాన్లు కూడా లేవు. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు.

తెల్లవారుజామున 4.30 గంటలకే దైవానికి హారతి ఇవ్వడంతో వీరి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం భజన, ప్రసాదం తర్వాత రోజువారీ పనులకు వెళతారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతోపాటు సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతోపాటు వ్యవసాయం, చేతి వృత్తులు, తల్లిదండ్రులకు, గురువుకు సేవ చేయడం వంటివి నేర్పుతారు. 

60 ఎకరాల్లో గ్రామాన్ని నిర్మించి..
ఇక్కడున్న వారంతా ఒడిషా, హైదరాబాద్, కడప, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారే. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో ఇలాంటి గ్రామాన్ని నిర్మిద్దామని భావించారు. అక్కడ భూములకు సాగునీటి సదుపాయం లేక, సేంద్రియ పంటలు పండే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇక్కడ 60 ఎకరాలు కొనుగోలు చేసి కూర్మ గ్రామాన్ని నిర్మించారు. గుజరాత్‌లోని నంద, పంజాబ్‌లోని బద్రికాశ్రమం, తమిళినాడులో పంచవటి, మధ్యప్రదేశ్‌లో భక్తి గ్రామాలు ఈ కూర్మ లాంటివే. కొత్తగా ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో చెక్‌ రిపబ్లిక్, హంగేరి దేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. సరళ జీవనం, ఉన్నత చింతనం ఈ గ్రామంలో జీవించే ప్రజలు ఆచరించే ప్రత్యేకత. నిత్యావసరాలైన ఆహారం, దుస్తులు ప్రకృతి సేద్యం ద్వారా పొందుతున్నారు. రసాయనాలు లేని వ్యవసాయం చేస్తూ తమకు సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. కావాల్సిన వరిని సాగు చేయటమే కాక... దుస్తులును కూడా మగ్గంపై నేసుకుంటున్నారు.

జీవనశైలికి పూర్వ వైభవం
పూర్వం భారత జీవన విధానంలో సుస్థిర జీవనాన్ని ఆధ్యాత్మికతతో గడిపేవారు. సంతోషం, సంతృప్తితో జీవించేవారు. యాంత్రీకరణ, రసాయనిక, ఆధునిక విధానం వచ్చాక మనిషిలో సంతోషం, సంతృప్తితో పాటు ఆధ్యాత్మికత, ఆయుష్షు తగ్గుతూ వస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు... ‘భారత జీవన శైలి’లో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం 
– నితాయ నిమాయ్‌ దాస్, కూర్మ గ్రామ నివాసి 

ఆచరణలో చూపిస్తున్నాం
భగవద్గీత ధర్మప్రచార బోధనలే కాకుండా ఆనాటి జీవన విధానాన్ని ఆచరిస్తున్నాం. సరళ జీవనానికి ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదని నిరూపిస్తూ ఆధ్యాత్మిక, ధర్మ ప్రచారం, వ్యవసాయ, గో ఆధారిత జీవన విధానాన్ని ఆచరణలో చూపిస్తున్నాం.
– త్రిభంగానంద్‌ దాస్, కూర్మ గ్రామ నివాసి

భగవంతుని సేవతోనే సంతృప్తి
భగవంతుని సేవతోనే సంతృప్తి చెందగలుగుతాం. కూర్మ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గంటల పాటు వ్యవసాయ, గో ఆధారిత సేవలు చేస్తూ మిగిలిన సమయం మెత్తం భగవంతుని సేవలో మమేకమవుతాం. శరీరం తాత్కాలికం. ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆత్మను సంతోషపెట్టాలంటే  భగవంతుని సేవలో ఉండాలని నమ్ముతూ, ఆచరిస్తూ జీవిస్తున్నాం.    
– గౌర గోపాల్‌దాస్, కూర్మ గ్రామ నివాసి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top