సింహపురికి కలియుగ దైవం

Sri Venkateswara Vaibhatsavalu In Nellore Starts From August 16th - Sakshi

నెల్లూరులో ఆగస్టు 16 నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు

టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం

నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అధికారులతో కలిసి శనివారం ఆయన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో నిత్యం నిర్వహించే అన్ని సేవలను భక్తులు వీక్షించే వీలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇందు కోసం విస్తృతంగా ఏర్పాట్లు  చేపడుతున్నామన్నారు. టీటీడీ దిల్లీ సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి ఉదయం 5.30 గంటలకు సుప్రభాతం నుంచి రాత్రి 8.30 గంటలకు జరిగే ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైభవోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్న ప్రసాదాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. భక్తులందరూ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కృపకుపాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు ఎస్‌ఈ–2 జగదీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్వో డాక్టర్‌ టి.రవి, ధార్మిక ప్రాజెక్ట్‌ల అధికారి విజయసారథి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top