
సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు.
ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్(40).. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉండ సాగాయి. ఉగ్రవాదులతో అతను వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్ మీడియా అకౌంట్లనూ తనిఖీ చేశారు. వీటి ఆధారంగా.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు..
నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.