పులసను మించి క్రేజ్‌.. ‘రామలు’ రాలేదేంటో!

Special Ramalu fish endangered on Godari coast Andhra Pradesh - Sakshi

గోదారి తీరంలో లభించే ప్రత్యేకమైన చేపలు ‘రామలు’

ఎక్కడ పుట్టినా శ్రీరామ నవమి నాటికి భద్రాచలం చేరిక

వీటి ప్రత్యేకత గోదావరి.. ఉప్పుటేరులు.. మడ అడవులే వీటి ఆవాసం 

రామల జాడలేక అల్లాడుతున్న మాంసాహార ప్రియులు

అంతరించిపోతున్నఅరుదైన మత్స్య జాతి!

‘రామలు’.. గోదావరి జిల్లాల్లో పులసలకు మించి క్రేజ్‌ ఉండే చిన్నపాటి చేపలివి. 9 అంగుళాల పొడవున.. పాము ఆకారంలో ఉండే ఈ జాతి చేపలు ఏ ప్రాంతంలో ఉన్నా.. నదుల ద్వారా ప్రయాణం సాగించి సీతారాముల కల్యాణం (శ్రీరామనవమి)లోగా భద్రాచలం చేరి తరిస్తాయన్నది ఓ కథనం. అందుకే వీటికి ‘రామ’లు అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఏడాది ఎక్కడా రామల జాడ కనిపించలేదు. సీజన్‌ ముగిసిపోతున్నా గోదావరి ఏ పాయలోనూ వాటి ఆచూకీ నేటికీ లభించలేదు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన చేప జాతుల్లో ఒకటైన ‘రామలు’ జాడ ఈ ఏడాది ఎక్కడా కనిపించకపోవడంతో మాంసాహార ప్రియులు అల్లాడిపోతున్నారు. సముద్ర తీరాన గోదావరి పరీవాహక ప్రాంతంలోని మడ అడవులు, ఉప్పునీటి ఏరుల్లో మాత్రమే ఇవి అరుదుగా లభిస్తాయి. వీటికి సుడపోక్రిప్టస్, ఇలాంగాటస్‌ అనే శాస్త్రీయ నామాలు ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లభించే ఈ అరుదైన చేపలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ప్రియులున్నారు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలోని గూడపల్లి, కాట్రేనిపాడు, గోగన్నమఠం, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తదితర ప్రాంతాలు రామలకు ప్రసిద్ధి. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో రామలు లభిస్తాయి. నాచునే ఆహారంగా తీసుకుంటాయి.  

పులసను మించి క్రేజ్‌ 
ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే పులసలకు మించిన క్రేజ్‌ రామలకు ఉంది. రుచిలో మరే చేపలకు లభించని ఆదరణ వీటి సొంతం. రామల కూరకు ఈ ప్రాంతంలో మంచి డిమాండ్‌ ఉంది. మసాలా దట్టించి ఇగురు.. అదే సీజన్‌లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెడితే ఆహా ఏమి రుచి అంటూ మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని వీటిని ఆరగిస్తారు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందే.

సీజన్‌ ముగిసిపోతున్నా గోదావరిలో ఏ పాయలోనూ రామలు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. రామ సైజును బట్టి ధర పలుకుతుంది. సాధారణంగా రామ సైజు 9 అంగుళాల వరకు ఉంటుంది. ఒక్కో రామ ధర రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. సైజు చిన్నవైతే తక్కువ పరిమాణంలో ఉంటే  రామ ఒక్కొక్కటీ రూ.18 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తారు. 

ఈ ఏడాది వీటి జాడ లేదు 
కొంతకాలంగా రామలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది గోదావరి, సముద్ర తీరం చెంతన ఎలాంటి జల వనరుల్లోనూ వీటి జాడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో చేపల చెరువుల్లోనూ రామలను పెంచుతున్నారు. అయితే, గోదావరి వెంట సెలయేరులు, బోదెల్లో సహజంగా పెరిగే రామలకు ఉండే రుచి వీటికి  రావడం లేదు.   

చేదు కట్టుకు డిమాండ్‌ ఎక్కువ 
సాధారణంగా చేపలలో ఉండే చేదు కట్టును తొలగించాకే వంటకు వినియోగిస్తారు. అయితే, రామలను చేదు కట్టుతోనే కూర వండుతారు. రామలలో ఉండే చేదు కట్టు జీర్ణాశయానికి, శరీర పటుత్వానికి ఉపయోగపడుతుందని మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు చెబుతున్నారు. 

ఇంటికొచ్చే వరకు బతికే ఉంటుంది 
అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మొదటి వారంలోపు మాత్రమే రామలు లభిస్తాయి. పులసలు మాదిరిగానే ఇవి రుచిలో మేటిగా ఉంటాయి. ఇటీవల వీటి జాడ తగ్గిపోయింది. అక్కడక్కడా చెరువుల్లో పెంచుతున్నా వాటికి పెద్దగా రుచి ఉండదు. చేప ఒకసారి రుచి చూస్తే ఇక వదలరు. రామలను నీటిలోనే ఉంచి విక్రయిస్తారు. ఇంటికి తీసుకువెళ్లే వరకు బతికి ఉండే అరుదైన చేప ఇది.     
– చిట్టూరి గోపాలకృష్ణ, శాస్త్రవేత్త, మత్స్యశాఖ

రామలు అంతరించిపోతున్నాయి 
రామలు అంతరించిపోతున్నాయి. మాకు రామల సీజన్‌లో ఆదాయం బాగా వచ్చేది. వాటి ఆవాసాలకు ఇబ్బంది కలగడంతోపాటు చైనా గొరకలు విపరీతంగా పెరిగి ఇలాంటి చేపలను తినేస్తున్నాయి. దీనివల్ల అరుదైన రామల చేప అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది.
– ఓలేటి అమావాస్యరాజు, మత్స్యకారుడు, గోగన్నమఠం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top