సాయికృష్ణ కేసులో ‘సిట్‌’ సాగదీత! | SIT to interrogate Nagaraju in Vijayawada till 16th july | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో ‘సిట్‌’ సాగదీత!

Jul 9 2026 5:48 AM | Updated on Jul 9 2026 5:48 AM

SIT to interrogate Nagaraju in Vijayawada till 16th july

నెలలు గడిచిపోతున్నా పురోగతి శూన్యం 

నాగరాజు బినామీ సురేష్‌ ఏమైనట్లు?

అదృశ్యమైన ఆర్‌ఎంపీ.. మూతబడ్డ క్లినిక్‌ 

నోరు మెదపని పోలీస్‌ బాస్‌లు 

16 వరకు నాగరాజును విజయవాడలో విచారించనున్న సిట్‌

సాక్షి, విజయవాడ/సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో ‘సిట్‌’ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండగా.. పోలీస్‌ బాస్‌లు పెదవి విప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంట్‌ సభ్యుడు, పోలీస్‌ బాస్, నగర బాస్‌లకు తెలిసే ఇదంతా జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సాంబయ్య, బాబురావును అరెస్టు కాగా సిట్‌ విచారణ ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగడం వెనుక ప్రభుత్వ ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బాధిత కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించిన తరువాతే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చింది. నిజాలు తేల్చాలని అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో సిట్‌ను ఏర్పాటు చేసింది. మరి నెలన్నర రోజుల్లో విచారణలో సిట్‌ ఏం తేల్చిందంటే సమాధానం లేదు. తన కుమారుడిని చంపేశారని.. కనీసం బూడిదైనా ఇవ్వండయ్యా..! అంటూ వేడుకుంటున్న సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆర్తనాదం అరణ్య రోదనగానే మిగిలింది.

నాగరాజు బినామీ సురేష్‌ ఎక్కడ?
సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో ఏ 4 ఎవరు? ప్రధాన నిందితుడు నాగరాజు బినామీ సురేష్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుందా? లేదంటే పరారీలో ఉన్నాడా? అనే విషయాలపై స్పష్టత లేదు. కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్‌ఎంపీని సిట్‌ విచారించిందా? లేదా? అనేది వెల్లడించలేదు. వైద్యం చేయడానికి అతడిని ఎవరు పిలిపించారు? అతడినే  పిలవడానికి కారణాలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. కృష్ణలంక స్టేషన్‌కు సమీపంలోనే క్లినిక్‌ నడుపుతున్న ఆర్‌ఎంపీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నాడు. కొద్ది రోజులుగా క్లినిక్‌ మూతపడింది. 

సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌కు అనుమతి..
న్యాయస్థానం అనుమతి మేరకు నిందితుడు నాగరాజును సిట్‌ బృందం గురువారం నుంచి ఈ నెల 16 వరకు విచారించనుంది. విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు సవరించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి నాగరాజును విజయవాడకు తరలించనున్నారు. సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌కు న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 17వ తేదీన విజయవాడ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎదుట ఒరిజినల్‌ వీడియో రికార్డులను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. 

నిందితుడు నాగరాజు నోరు మెదపకుండా నొక్కి పెడుతున్నది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కృష్ణలంక పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్‌ బాబు, సహాయ రైటర్‌ వీరాంజనేయుడు, రైటర్‌ రాజేష్‌ తదితరులు సిట్‌ ఎదుట విచారణకు హాజరైనట్లు సమాచారం. మే 6వతేదీ నుంచి 8వ తేదీ వరకు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు? ఆ సమయంలో స్టేషన్‌లో ఏం జరిగిందనే కోణంలో విచారించినట్లు సమాచారం. 

సీఐ నాగరాజుకు రిమాండ్‌ పొడిగింపు
విజయవాడ లీగల్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజు రిమాండ్‌ బుధవారం ముగియడంతో పోలీసులు న్యాయస్థానంలో వర్చువల్‌గా హాజరుపరిచారు. విచారణ అనంతరం నాగరాజుకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ న్యాయమూర్తి ఎస్‌.శ్రీకాంత్‌ ఆదేశాలు జారీచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement