‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్‌సీపీ పోస్టర్‌ ఆవిష్కరణ | Sajjala Ramakrishna Reddy unveiled the Two Years of Betrayal poster and booklet | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్‌సీపీ పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 1 2026 2:44 PM | Updated on Jun 1 2026 4:00 PM

Sajjala Ramakrishna Reddy unveiled the Two Years of Betrayal poster and booklet

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.  
తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
రెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్‌లో  ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.

ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.

ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలు
ప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్‌తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.

రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా  4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం.  అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేశారు.

ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్‌ జగన్‌ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్‌ జగన్‌  పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.

నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలి
చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌  జగన్‌ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.

మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. 

మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్‌ జగన్‌ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్‌ జగన్‌ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement