చంద్రబాబు అమరావతి దోపిడీ ప్రతిపాదన..!
గ్రోత్ ఇంజిన్‌గా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాం
దాని కొనసాగింపే మావిగన్ ప్రతిపాదన
అప్పుల భారం లేని గ్రోత్ ఇంజిన్‌గా అభివృద్ధి
చంద్రబాబు అవినీతి కోసం మంచి గ్రోత్ కారిడార్‌ను విస్మరిస్తున్నారు
ఈ మూడు నగరాలు అభివృద్ధి చెందడం బాబుకు ఇష్టంలేదు
వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ మంచి ప్రతిపాదన అని, సీఎం చంద్రబాబు చెప్పే అమరావతి దోచుకోనే ప్రతిపాదన అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి కట్టే బదులు, మావిగన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని మూడు ముక్కలాట అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ చెప్పారు
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని చెప్పారు. జగన్ ఇప్పుడు చెప్పిన ప్లాన్ బీ కూడా కొత్తదేమీ కాదు. కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే పెద్దగా చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఈ కారిడార్‌కు మావిగన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు ఉన్నాయి. నోయిడా అసలు పేరు.. ‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ’. పేర్లు ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజిన్‌గా అభివృద్ధి చేసేందుకు జగన్ పోర్టు నిర్మాణం చేపట్టారు.
మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే. ఒక మంచి గ్రోత్ కారిడర్‌ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నారు. ఈ మూడు నగరాలు కలవడం బాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్‌ను అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ రాకుండా అడ్డుకుంటున్నాడు. మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రాజధాని పెడితే చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుల భారం ఉండదు. జగన్ చేసిన ఈ ఆచరణాత్మక ప్రతిపాదనపై ఈ మూడు నగరాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మేధావులు చర్చిస్తున్నారు.
మంచి ప్రతిపాదన అని అంగీకరిస్తున్నారు. మా పార్టీ నాయకులంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నాయకులు వ్యతిరేకించారన్నది దుష్ప్రచారమే. అమరావతికి కులం రంగు పులిమిందీ చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేశ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.
అమరావతి ఇప్పట్లో కాదని బాబే చెబుతున్నారు
బాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెబుతున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదనా అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్‌లో ఉన్న రేటు రావడానికి ఎంత కాలం పడుతుంది? చంద్రబాబువన్నీ మభ్యపెట్టే మాటలే.
ఇదీ నయా రాయ్‌పూర్ వాస్తవ పరిస్థితి
చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్‌పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. రాయ్‌పూర్ కోసం ఆ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అదీ తీర్చేశారు. అక్కడ చేసిన ఖర్చు రూ.7 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని వస్తే ఇలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్‌పూర్‌లో పెట్టారు. ఇక్కడ వికేంద్రీకరణ పెద్ద తప్పుగా దుష్ప్రచారం చేశారు.
అమరావతి రైతులకూ అన్యాయం చేశారు
చంద్రబాబు అమరావతి రైతులకూ అన్యాయం చేశారు. ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.
అమరావతి సంబరాలను ప్రజలు, అధికారులు పట్టించుకోలేదు
అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా వారు కూడా పట్టించుకోలేదు.


