దెబ్బతిన్న పంటకు సర్కారు భరోసా

Relaxation Of Peanut And Cotton Purchase Regulations - Sakshi

వేరుశనగ, పత్తి కొనుగోలు నిబంధనల సడలింపు

సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వేరుశనగ, పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చింది. పత్తిలో అధిక తేమ, వేరుశనగలో గింజ నాణ్యత (శాతం) పడిపోవడం వల్ల రైతులు మద్దతు ధరకు అమ్ముకోలేక ఆందోళన చెందుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల అమ్మకానికి సంబంధించి నిబంధనలు సడలించింది. ఇప్పటి వరకు ఉన్న టైం స్లాట్‌ విధానంలో పేర్కొన్న తేదీ, సమయానికే రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి. పొరపాటున ఆ సమయానికి తీసుకెళ్లలేకపోతే మళ్లీ తమ పేరును ఆర్బీకేలో నమోదు చేసుకుని, ఆ తేదీ వరకు నిరీక్షించాలి.

ఈ ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం అందులో కొంత వెసులుబాటు కల్పించింది. దీంతో రైతులు ఆ సీజన్‌లో ఎప్పుడైనా పంట వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్, పట్టాదారు పుస్తకం, బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌ కాపీలతో వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. కొత్త నిబంధన ప్రకారం రైతులు ఏ రోజున పంట అమ్ముకోవాలని భావిస్తారో అదే రోజున కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లొచ్చు. అక్కడి అధికారులు నాణ్యతను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేస్తారు. నాఫెడ్‌ నిబంధనల ప్రకారం నవంబర్‌లో రైతు పండించిన పత్తి పంటలో 30 శాతమే కొనుగోలు చేయాలి. మిగిలిన పంట డిసెంబర్, జనవరిలో కొనుగోలు చేసే విధంగా నిబంధన కొనసాగుతోంది. ఈ నిబంధనను ప్రభుత్వం ప్రస్తుతం మార్పు చేసింది. తద్వారా 75 శాతం పంటను ఇప్పుడు రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. 

వేరుశనగ రైతులకు ఊరట
► వర్షాల కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆ పంటను అమ్ముకోలేకపోతున్నారు. దీంతో వ్యాపారులు సగానికి సగం ధరను తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల రీత్యా వేరుశనగ పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 
► కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేరుశనగ పంటలో గింజ 65 శాతానికిపైగా ఉంటేనే క్వింటా రూ.5,275కు కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే వర్షాల కారణంగా 60 శాతం గింజ (అవుటెన్‌) ఉంటే సరిపోతుందని, ఆ విధంగా ఉన్న వేరుశనగకు క్వింటాకు రూ.4,500 ధర ప్రకటించింది. మార్కెట్‌లో వ్యాపారులు 60 శాతం గింజ ఉన్న వేరుశనగను రూ.3,500కే కొనుగోలు చేస్తున్నందున ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఊరట కలిగిస్తోంది. 
► డ్యామేజీ 2 నుంచి 3%, దెబ్బతిన్న గింజలు 2 నుంచి 6%, గింజ ముడత, పక్వానికిరాని కాయలు 4 నుంచి 8%నికి పెంచింది. నిబంధనలు సడలించడం వల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు భారం పడనుంది. ఈ నిబంధనలు తక్షణం అమలు పరచాలని కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, అధికారులను ఆదేశించామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. 

వరదలతో భారీగా పంట నష్టం
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వేరుశనగ, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయలసీమ జిల్లాల్లో 7.46 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటే ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 4 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేనందున క్వింటా రూ.4 వేలకు మించి అమ్ముకోలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.83 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్ల వరకు రైతులు పత్తి సాగు చేశారు. 8 శాతం లోపు తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.5,825 చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే వర్షాల కారణంగా తేమ శాతం 12 శాతానికిపైనే ఉంటోంది. దీంతో క్వింటా రూ.3,500తో మాత్రమే ప్రైవేట్‌ వ్యాపారులు కొంటున్నారు. ఈ దృష్ట్యా పంటను ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top