సింహపురి సిగలో మరో మణిహారం 

Rapid Industrial Development In PSR Nellore District - Sakshi

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి 20న సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

జిల్లాలో వేగం పుంజుకున్న పారిశ్రామికాభివృద్ధి

కొత్త పరిశ్రమలు.. లక్షల్లో ఉద్యోగాలు

కృష్ణపట్నం వద్ద క్రిస్‌ సిటీ ఏర్పాటుకు చర్యలు

క్రిబ్‌కో పరిధిలో   బయో ఇథనాల్‌ ప్లాంట్‌

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు హడావుడి శంకుస్థాపనకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాగా, చిత్తశుద్ధితో నిర్మాణ పనులు చేపట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అవసరమైన భూసేకరణ పూర్తయింది. ఈనెల 20న పోర్టు నిర్మాణానికి  భూమి పూజ చేయనున్నారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సింహపురి ఉన్నతికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూనే పారిశ్రామికాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయనున్నారు. ఉదయగిరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే అదానీ కృష్ణపట్నం పోర్టు సమీçపంలో క్రిస్‌ సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చాయి. మరోవైపు బయో ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. 

ఎగుమతులకు తగినట్లుగా.. 
రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉంది. మునపటి రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి సిమెంట్, ఐరన్, పొగాకు ఇంకా పలురకాల ఖనిజాలు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. బొగ్గు, ఎరువులు తదితరాల దిగుమతి జరుగుతోంది. ఈ వ్యవహారమంతా ప్రస్తుతం అదానీ కృష్ణపట్న ం పోర్టు ద్వారా కొనసాగుతోంది. తదుపరి చెన్నై ఓడరేవు అందుబాటులో ఉంది. ఉత్పత్తుల ఎగుమతులకు కృష్ణపట్నం ఓడరేవు సామర్థ్యం సాధ్యపడకపోవడంతో రామాయపట్నం పోర్టు తెరపైకి వచ్చింది. 25 మిలియన్‌ టన్నుల సామర్థ్యంలో రూ.10,640 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టనున్నారు. మొత్తం 19 బెర్తులు కట్టనున్నారు. 

తొలివిడతలో ఒకటి కోల్, రెండు బెర్తులు కంటైనర్లు, ఒక బెర్త్‌ మల్టీపర్పస్‌ కోసం నిర్మించదలిచారు. పోర్టుకు అనుబంధంగా ఏపీఐఐసీ పరిధిలో భూసేకరణ చేస్తున్నారు. అందులో అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన రామాయపట్నం పోర్టు నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీగా మిగిలిపోవడం మినహా కార్యరూపం దాల్చలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో హడావుడిగా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,736 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. పోర్టుకు అవసరమైన 803 ఎకరాలను సేకరించారు. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

పెద్దఎత్తున ఉద్యోగాలు
చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్‌ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరుతో టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దక్కనుంది. తొలిదశ కోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు పూర్తయ్యాయి. అలాగే సర్వేపల్లి వద్ద కృషక్‌ భారతి కో–ఆపరేటీవ్‌ లిమిటెడ్‌ (క్రిబ్‌కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

కష్టాలు తొలగిపోతాయి 
రామాయట్నం పోర్టు నిర్మిస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇది శుభపరిణామం. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువత వారి అర్హతకు తగ్గట్లుగా ఉపాధి పొందుతారు. పారిశ్రామికాభివృద్ధితో కష్టాలు తొలగిపోతాయి.     
– వంశీ, నవాబుపేట 

యువతకు మంచిరోజులు  
జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే అనేక పరిశ్రమలు నెల్లూరుకు వచ్చాయి. మరిన్ని ఏర్పాటుతో యువతకు బాగా ఉద్యోగాలొస్తాయి. వారికి మంచి రోజులొచ్చాయి.  
– అరవ యాకుబ్, స్టౌన్‌హౌస్‌పేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top