జాతీయ రహదార్లకు ర్యాంకింగ్‌లు

Rankings for National Highways - Sakshi

అక్టోబర్‌ నుంచి అందుబాటులోకి తేనున్న ఎన్‌హెచ్‌ఏఐ 

హైవే సామర్థ్యం, భద్రత,ప్రమాద రేటు తదితర విభాగాలే ప్రామాణికం

సాక్షి, అమరావతి: రహదారుల నాణ్యతను మెరుగుపరిచేందుకు రోడ్ల పనితీరు ఆడిట్‌ ఆధారంగా ర్యాంకింగ్‌ వ్యవస్థను ఎన్‌హెచ్‌ఏఐ ప్రవేశపెట్టనుంది. హైవేలపై ప్రయాణికులకు అందే సేవలపై, రోడ్డు నాణ్యత, రహదారి భద్రతలపై అభిప్రాయాలు సేకరించి ఆ మేరకు ర్యాంకింగ్‌లను నిర్ణయించనుంది. అక్టోబర్‌ నుంచి జాతీయ రహదార్ల ర్యాంకింగ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ర్యాంకింగ్‌లతో పాటు బీవోటీ (బిల్డ్‌–ఆపరేట్‌–ట్రాన్స్‌ఫర్‌), హెచ్‌ఏఎం (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌), ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) ప్రాజెక్టుల కింద చేపట్టిన రోడ్లకు ప్రత్యేక ర్యాంకింగ్‌లను కేటాయిస్తారు. జాతీయ రహదార్లపై రోడ్‌ ఇంజనీరింగ్‌ లోపాల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లోపాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీల ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ప్రొఫెసర్లు సర్వే చేసి రోడ్‌ ఇంజినీరింగ్‌ లోపాలపై నివేదిక ఇస్తారు. ఏపీలో మొత్తం 6,672 కి.మీ. మేర జాతీయ రహదార్ల నెట్‌వర్క్‌ ఉంది. 38 జాతీయ రహదార్ల ప్రాజెక్టులకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నారు. 

ర్యాంకింగ్‌ల అంచనాకు ప్రామాణికం ఇదే.. 
► హైవే సామర్థ్యం (45 శాతం), రోడ్‌ సేఫ్టీ (35 శాతం), యూజర్‌ సర్వీసెస్‌ (20 శాతం) ఈ మూడు విభాగాల్లో అంచనా వేస్తారు.  
► వాహనం ఆపరేటింగ్‌ వేగం, యాక్సెస్‌ కంట్రోల్, టోల్‌ ప్లాజాల వద్ద తీసుకున్న సమయం, సేవలు, ప్రమాద రేటు తదితర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. 
► ఈ అంచనా ప్రకారం ఎన్‌హెచ్‌ఏఐ ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తుంది. 
► ప్రతి జాతీయ రహదారి కారిడార్‌ పొందిన స్కోరు, మెరుగుపరుచుకునేందుకు ప్రయాణికుల అభిప్రాయాలను ఎన్‌హెచ్‌ఏఐ సేకరిస్తుంది.
► నాణ్యమైన రహదార్లను నిర్మించేందుకు ఈ ఆడిట్‌ అవసరమని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top