సానా సతీష్ బాబు, కిలారు రాజేష్
రాజ్యసభ సీటు కోసం టీడీపీలో హోరాహోరీ
కిలారు రాజేష్ కోసం చినబాబు పట్టు
మళ్లీ చాన్స్ కోసం సానా సతీష్ లాబీయింగ్
వీరిద్దరిలో ఒకరికే ఇచ్చే యోచనలో చంద్రబాబు
రేసులో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి
ఆర్టీక బలం కలిగిన మహిళా నేత కోసం అన్వేషణ?
సాక్షి, అమరావతి: రాజ్యసభ సీట్ల భర్తీ టీడీపీలో రసకందాయంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్ బాబుకు మళ్లీ అవకాశం దక్కుతుందా లేదా అనే విషయం కూటమిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు ఏడాది క్రితమే ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో రెన్యువల్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సానాను పక్కనపెట్టి లోకేశ్ వ్యవహారాలను చక్కబెట్టే కిలారు రాజేష్ కి అవకాశం ఇస్తారనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఎలాగైనా సరే ఈసారి రాజేష్‌కి ఎంపీ పదవి ఇప్పించుకోవాలని లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో చేసేది లేక అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజేష్ కి అవకాశం ఇచ్చి సానా సతీష్ ని పక్కనపెట్టాలనే యోచనలో చంద్రబాబు, లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సానా సతీష్ , రాజేష్ ఇద్దరూ లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తులు. అయితే పార్టీతో సంబంధం లేని లాబీయిస్ట్ సానా సతీష్ ఎంపీ కావటాన్ని టీడీపీ సీనియర్లు, ఎల్లో మీడియాకి చెందిన ముఖ్యులు జీరి్ణంచుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు కొన్ని ఆర్టీక, రాజకీయ వ్యవహారాల్లో కూడా తేడా రావడంతో సానా కంటే తన సొంత మనిషి రాజేషే బెటర్ అని లోకేశ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి రాజేష్ ని రాజ్యసభకు పంపాల్సిందేనని నిర్ణయించినట్లు సమాచారం.
కుదిరితే సానాను కూడా కొనసాగించాలని భావిస్తున్నా ఆయన కోసం అంతగా పట్టుబట్టడంలేదు. వారిద్దరిలో ఒకరికే అవకాశం ఇద్దామని చంద్రబాబు చెబుతుండడంతో రాజేష్ వైపే లోకేశ్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు సానా సతీష్ ఎలాగైనా సరే ఎంపీ స్థానాన్ని రెన్యువల్ చేయించుకోవడం కోసం భారీ లాబీయింగ్ చేస్తున్నారు. తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేశ్, చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాజేషా.. సతీషా? అనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది.
మూడు సీట్లకు టీడీపీ వ్యూహం..!
ఈదఫా ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి మూడు స్థానాలు కావాల్సిందేనని బీజేపీకి సంకేతాలు పంపుతున్నారు. అవసరమైతే జనసేనను పక్కన పెట్టయినా మూడో స్థానాన్ని చేజిక్కించుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా టీడీపీ నేతలు చెబుతున్నారు.
రేసులో మరి కొందరు..
పెద్దల సభకు వెళ్లేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని భాష్యం విద్యా సంస్థలకు చెందిన రామకృష్ణ, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య తదితరులు అధినేతను కోరుతున్నారు. భాష్యం రామకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించడంతోపాటు చురుగ్గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ సీటు కోసం ప్రయతి్నంచినా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయన రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తూ ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీకంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చంద్రబాబు కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గత ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ తప్పిదం చేశానని భావిస్తున్న గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభ స్థానం కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సైతం తన రాజ్యసభ కల నెరవేర్చాలని చంద్రబాబును కోరుతున్నారు. వర్ల రామయ్య కూడా తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక మహిళకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్లు తెలిసింది. ఆ స్థాయి అర్థబలం ఉన్న మహిళా నేతలు ఎవరున్నారా? అనే అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.


