పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి

R Krishnaiah Comments About BC Reservation Bill - Sakshi

26న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

రాజమహేంద్రవరం సిటీ (సీటీఆర్‌ఐ)/పాలకొల్లు అర్బన్‌: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 55 శాతం జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.

బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ కావడంతో ఆయనపైనే బీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. మోదీ హయాంలో ఈ బిల్లు పెట్టకపోతే చరిత్ర ఆయనను క్షమించదన్నారు. లోక్‌సభలో 94 మంది బీసీ ఎంపీలున్నారని, పార్టీలకతీతంగా వీరందరూ బిల్లుకు మద్దతివ్వాలని, లేకుంటే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2021–22 జనగణనలో కులాల వారీగా బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణాలపై విధించిన షరతులను ఎత్తివేయాలని కోరారు.

పంచాయతీరాజ్‌లో సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి 
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top