లక్ష్యం దాటిపోయిందంటూ కొనుగోలు కేంద్రాలు మూత
చంద్రబాబు సర్కారు నిర్వాకం
రబీలో 4.57 లక్షల టన్నుల దిగుబడి
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో 2 లక్షల టన్నుల నిల్వలు
కేవలం 84వేల టన్నుల కొనుగోలుతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.5,650.. బహిరంగ మార్కెట్‌లో దక్కే ధర రూ.4900 లోపే
అదనపు అనుమతుల కోసం కేంద్రానికి లేఖ అంటూ సర్కారు నాటకం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15 శాతం కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. మార్కెట్‌లో ధర లేక.. కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అదనపు అనుమతుల పేరిట కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతోంది.
దక్కే ధర రూ.4,900లోపే..
ఈ ఏడాది రబీలో 10.30 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.5,650 కాగా.. మార్కెట్‌లో రూ.4,600 నుంచి రూ.4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు.
గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుండగా, ఈ ఏడాది పంట మార్కెట్‌కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్‌లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. కేంద్రంపై భారం నెట్టేసి.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమైంది.
అర్థంతరంగా కొనుగోలు కేంద్రాలు మూసివేత
ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్‌కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతివ్వగా, కేవలం 84 వేల టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 30–40 శాతం పంట మాత్రమే మార్కెట్‌కు వచ్చింది.
గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. అదనపు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖమంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇలా లేఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల్ని మూసేశారు
ఐదెకరాల్లో శనగ వేశాను. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్‌లో మొక్కుబడి తంతుగా కేంద్రాలు తెరిచి.. సీజన్ ముగియకుండానే మూసేశారు. మద్దతు ధర దక్కక,.. బహిరంగ మార్కెట్‌లో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు, ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. – బి.దస్తగిరి, మాలేపాడు, ఎర్రగుంట్ల మండలం, వైఎస్సార్ కడప జిల్లా
రెండేళ్లుగా ఇదే పరిస్థితి
మద్దతు ధర దక్కక.. పంటను కొనుగోలు చేసేవారు లేక శనగ రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పూర్తిగా మార్కెట్‌కు రాకుండానే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈ ఏడాది దిగుబడిలో కనీసం 15 శాతానికి మించి కొనుగోలు చేయలేదు. కోతకొచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
గతేడాది పంట అమ్ముడుకాక కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం


