Proddatur: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

Proddatur Former MLA MV Ramana Reddy Passes Away - Sakshi

రాజకీయ నేత, ఉద్యమకారుడు, కవి, విమర్శకుడిగా రాణింపు   

‘సీమ’ సమస్యలపై ఎలుగెత్తడంతో మంచి గుర్తింపు 

ఎన్టీఆర్‌తో విభేదించి రాయలసీమ విమోచన సమితి స్థాపన

ట్రేడ్‌ యూనియన్లకు నాయకత్వంతో పలు మార్లు జైలుకు..   

తుది వరకూ సాహిత్య వ్యాసంగంలో నిమగ్నం

సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి (78) – ఎంవీఆర్‌ బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన ఏడాదిగా ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని జీవిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆయన్ను కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం కాలకృత్యాల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స అందిస్తుండగానే కన్ను మూశారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు మల్లేల మురళీధర్‌రెడ్డి, మల్లేల రాజారాంరెడ్డి, కుమార్తె కవిత ఉన్నారు. చిన్న కోడలు మల్లేల ఝాన్సీరాణి ప్రస్తుతం ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసకర్తగా, కరపత్ర, కథా రచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికా నిర్వాహకుడిగా విభిన్న విశిష్టతలు కలిగిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు గడించారు.  

డాక్టర్‌ నుంచి రాజకీయ నేతగా..  
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో 1944 ఏప్రిల్‌ 4న జన్మించిన ఎంవీఆర్‌ స్థానికంగా ప్రాథమిక విద్య, గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివారు. ప్రొద్దుటూరులో ప్రగతి క్లినిక్‌ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారు. ఆంధ్రా కాటన్‌ మిల్లు కార్మికులకు సేవలు అందిస్తూ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా ఎదిగారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని సిమెంటు కర్మాగారాల్లోని ట్రేడ్‌ యూనియన్లకు నాయకత్వం వహించారు. రైతు కూలీ ఉద్యమం చేశారు. కొంత కాలం న్యాయవాదిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.  

సాహిత్య పరిచయం  
► 1966లో ‘కవిత’ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించారు. 1969లో ‘ప్రభంజనం’ అనే రాజకీయ పక్ష పత్రికను ప్రారంభించి, నాలుగేళ్ల పాటు నడిపారు. 1983లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగు సినిమా – స్వర్ణయుగం, పురోగమనం, పరిష్కారం, ఆయుధం పట్టని యోధుడు, తెలుగింటికి వచ్చిన ద్రౌపది, చివరకు మిగిలింది, పెద్దపులి ఆత్మకథ, మాటకారి, శంఖారావం, తెలుగింటి వ్యాకరణం తదితర పుస్తకాలు రాశారు.  
► చరమాంకంలో అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాగ్జిమ్‌ గోర్కీ ‘మదర్‌’ నవలను తెలుగులో ‘కడుపు తీపి’ పేరుతో అనువదించారు. టూకీగా ప్రపంచ చరిత్ర పేరుతో నాలుగు సంపుటాలు వెలువరించారు. తన ఆత్మకథను 151 పేజీలు రాసుకున్నారు. ఇది ఇంకా పూర్తవకుండానే తుదిశ్వాస విడిచారు.
 
నేడు తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు
ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

రాయలసీమ ఉద్యమంలో.. 
► 1985 జనవరి 1న ప్రొద్దుటూరు కేంద్రంగా రాయలసీమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 21 రోజుల తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఆ తర్వాతే రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వచ్చింది. 
► ఎన్‌టీ రామారావుతో రాయలసీమ సమస్యలపై విభేదించి.. రాయలసీమ విమోచన సమితి స్థాపించారు. 1985 డిసెంబర్‌ 31 నుంచి 1986 జనవరి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వరకు ‘కరువు యాత్ర’ చేపట్టారు.  
► రాయలసీమకు సేద్యపు నీరు కావాలని, సీమ వాటా ఉద్యోగాలివ్వాలని, పరిశ్రమలను స్థాపించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా కాటన్‌ మిల్‌ కార్మికుల విషయంలో జరిగిన గొడవల్లో ఎంవీఆర్‌ పలు  మార్లు జైలుకు వెళ్లారు. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించారు. విప్లవ సాహితీ వేత్తలతో కలిసి పని చేశారు. వివిధ కారణాలతో పలు మార్లు జైలుకెళ్లారు. 
► వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఆనాడు విభేదించినా, రాయలసీమ ఉద్యమ విషయాల్లో కొన్ని వేదికలను పంచుకున్నారు. ఖైదీగా ఉంటూ చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల రాష్ట్రంలో జైళ్లలో సంస్కరణలకు కారణమయ్యారు. 
► వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి సభ్యుడిగా ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేశారు.

గొప్ప మేధావి ఎంవీఆర్‌
సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయితగా, చరిత్రకారునిగా, రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకునిగా, విరసం వ్యవస్థాపక సభ్యునిగా విభిన్న రంగాల్లో నిష్ణాతునిగా పేరు పొందారని తెలిపారు. ఎంవీఆర్‌ రాసిన విప్లవాత్మక కవితలు, రాజకీయ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయని పేర్కొన్నారు. ఆయన గొప్ప మేధావి అంటూ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top