
ఉల్లికి మద్దతు ధర లేదని ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై కేసు
రైతులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే యత్నం చేశారట
అన్నదాతల్లో అశాంతిని రేకెత్తించేలా చూశారట
ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్, కర్నూలు: తాము పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్న మనస్తాపంతో సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధ చెప్పుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా చేశారని దుర్మార్గంగా తప్పుడు కేసులు కట్టారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన గుండ్లకొండ కృష్ణ, అతని సమీప బంధువు గుండ్లకొండ వెంకట్ నాయుడు ఉల్లి పంటను సాగు చేశారు. తీరా దిగుబడి చేతికందాక పంటకు అమాంతం ధర పడిపోయింది.
కిలో ఐదారు రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇలాగైతే బతకడం కష్టమని భావించి, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తమ బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని చుట్టుపక్కల వారు గమనించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చావు బతుకుల మధ్య పోరాడుతుండగా, ఆదివారం పలుకుదొడ్డి గ్రామ వీఆర్వో శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు బాధిత రైతులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేష్‌నాయక్ మీడియాకు వెల్లడించారు.
‘గుండ్లకొండ కృష్ణ, గుండ్లకొండ వెంకట్ నాయుడు రైతులను రెచ్చగొట్టి గొడవలను సృష్టించాలన్న దురుద్దేశంతోనే ఉల్లి పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక పురుగుల మందును వారి పొలంలోనే తాగినట్లు వీడియో తీసుకున్నారు. ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ రైతుల్లో అశాంతి రేకెత్తించేలా ప్రయత్నం చేశారు. అందువల్లే వీఆర్వో ఫిర్యాదుతో సదరు రైతులపై కేసు నమోదు చేశాం’ అని ఎస్‌ఐ తెలిపారు. ‘రైతులు పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నది బహిరంగ రహస్యం.
ఉల్లి రైతుకు కిలోకు ఎంత వస్తున్నదీ.. బహిరంగ మార్కెట్‌లో అదే ఉల్లి కిలో ఎంత పలుకుతున్నది ఇళ్లలో మహిళలెవరిని అడిగినా చెబుతారు. ఇలాంటి వాస్తవాన్ని విస్మరించి.. అధికార పార్టీ నేతల సూచనల మేరకు రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం’ అని అన్నదాతలు మండిపడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సింది పోయి ఇలా బాధిత రైతులనే వేధించడం ఇప్పుడే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కర్నూలులో శనివారం ఎందుకు ధర్నాకు దిగారో పోలీసులకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. క్వింటా ఉల్లికి మద్దతు ధరగా రూ.1,200 ప్రకటించి.. ఆ మేరకు కొనుగోళ్లు చేయకుండా మాట తప్పిందెవరు? నిజంగా కేసు పెట్టాల్సి వస్తే మోసం చేసిన ఈ ప్రభుత్వంపైనే పెట్టాలని మండిపడుతున్నారు.