
పేద మహిళలకు మంత్రి నారాయణ స్పష్టీకరణ
లోన్‌లు కట్టలేకపోతున్నామని మంత్రి ఎదుట మహిళల ఆవేదన
వాటిని రద్దు చేయాలని డిమాండ్
అదేమీ కుదరదు.. రుణాలు కట్టాల్సిందేనన్న నారాయణ
కర్నూలు(సెంట్రల్): టిడ్కో గృహ రుణాలను రద్దు చేయడం కుదరదని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం కర్నూలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల్లో నివాసముంటున్న పేద మహిళలు తాము గృహాల రుణాలను కట్టలేకపోతున్నామని, బ్యాంకులు వేధిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, వాటిని రద్దు చేయాలని నారాయణకు మొరపెట్టుకున్నారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ..‘అదేమీ కుదరదు. బ్యాంకులకు రుణం కట్టాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడతారు’ అని అన్నారు. దీంతో మహిళలంతా షాక్ తిన్నారు. నారాయణ మాట్లాడుతూ 2026 మార్చి ఆఖరిలోపు 7 లక్షల టిడ్కో గృహాలను పూర్తి చేస్తామని చెప్పారు. కర్నూలు టిడ్కో గృహాల సముదాయంలో 10 ఎకరాలను టీజీ భరత్‌కు ఇస్తామని, ఆయన అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసి 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు.
‘కూడా’ పరిధిలో మునిసిపల్ ఆస్తుల వేలం
ప్రభుత్వంపై భారం లేకుండా పాలన చేసేందుకుగాను కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (కూడా) పరిధిలోని మునిసిపల్ ఆస్తుల వేలానికి మంత్రి నారాయణ అనుమతిచ్చారని టీజీ భరత్ చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.