విజయవాడ: నగరంలోని ఆటోనగర్‌లో ఆపరేషన్ చేపట్టి 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. హిడ్మా గ్యాంగ్ ఆటోనగర్‌లో షెల్టర్ తీసుకుందని, దీనిపై విశ్వసనీయ సమాచారం ద్వారా భారీ సంఖ్యలో మావోయిస్టులను పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరంతా చత్తీస్‌గడ్‌కు చెందినవారేనని ఎస్పీ తెలిపారు.
ఇదిలా ఉంచితే, మావోయిస్టులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన దానిపైనే ఇప్పడు దృష్టి సారించారు పోలీసులు. అసలు ఆ ఇంటి యజమాని.. మావోయిస్టులకు ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు చెబితే ఇచ్చారు.. ఎవరి ద్వారా చెప్పించారు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.
ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది.
భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.


