3 Chaddi Gang Members Arrested: పగలు రెక్కీ.. రాత్రి లూటీ! ఖరీదైన అపార్ట్‌మెంట్లే టార్గెట్లు..

Police Arrested 3 Gujarat Chaddi Gang Members - Sakshi

ఇదీ చెడ్డీ గ్యాంగ్‌ దోపిడీ విధానం 

గుజరాత్‌లో ముఠాకు చెందిన ముగ్గురు సభ్యుల అరెస్ట్‌ 

రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి స్వాధీనం 

మరో ఏడుగురి కోసం కొనసాగుతున్న గాలింపు 

విజయవాడ సీపీ టి.కె. రాణా వెల్లడి

విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాలో సంచలనం రేపి.. జనాల్లో భయాందోళనలు కలుగజేసిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు పోలీసులకు చిక్కారు. ఈ అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండీ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ టి.కె. రాణా ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  

గుజరాత్‌ నుంచి రెండు గ్రూపులుగా.. 
►గుజరాత్‌లోని దాహోద్, మధ్యప్రదేశ్‌లోని జుబువా ప్రాంతాల నుంచి 10 మంది కరుడుగట్టిన దొంగలు గత నెల 26వ తేదీన విజయవాడ నగరానికి చేరుకున్నట్లు సీపీ చెప్పారు. ఈ గ్రూపుల సభ్యుల రాష్ట్రాలు వేరైనప్పటికీ ఒకరికొకరు పరిచయస్తులేనన్నారు. ఈ ముఠా సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి నగర శివారు ప్రాంతాల్లోని విల్లాలను, ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను టార్గెట్‌ చేస్తుంటారన్నారు. చోరీ చేసే సమయంలో వీరు బన్నీ, నిక్కర్‌ మాత్రమే ధరిస్తారన్నారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు చేస్తుంటారని సీపీ వెల్లడించారు. 


►గత నెల 28వ తేదీ రాత్రి చిట్టీనగర్‌ మిల్క్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద అక్కడున్న వాచ్‌మెన్‌ను మారణాయుధాలతో బెదిరించి, ఓ ఫ్లాట్‌లోకి చొరబడి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదును దోచుకెళ్లారన్నారు.  
►ఈ నెల ఒకటో తేదీన ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఇదే తరహాలో చొరబడి.. ఇనుపరాడ్లతో ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టే సమయంలో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు.  
►రెండో తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మూడు అపార్ట్‌మెంట్లలోకి చొరబడ్డారని, అయితే అక్కడ వీరికి ఏం దొరకకపోవడంతో నాల్గో తేదీన కుంచనపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు చెప్పారు.  
►ఆరో తేదీన పోరంకిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెండి, బంగారం, నగదు దోచుకెళ్లినట్లు వివరించారు. చోరీ చేసే సమయంలో ఎవరైన అడ్డుగా వస్తే దాడి చేసేందుకు ఈ ముఠా సభ్యులు కర్రలు, ఇనుపరాడ్డులు వినియోగిస్తారని సీపీ చెప్పారు.  
►నగర ప్రజలను కలవరపాటుకు గురిచేసిన ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకునేందుకు ఎంతో శ్రమించినట్లు సీపీ పేర్కొన్నారు. ఇక్కడ చోరీలు చేసిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు విజయవాడ నుంచి ఈ నెల 8వ తేదీన వారి సొంత గ్రామాలకు బయలుదేరారన్నారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, వేలి ముద్రలు పరిశీలించిన అనంతరం దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. డీసీపీలు హర్షవర్థన్‌రాజు, బాబురావు నేతృత్వంలో టూ టౌన్‌ సీఐ మోహన్‌రెడ్డి,  సీఐ సత్యనారాయణ, సీసీఎస్‌ సిబ్బందితో మూడు బృందాలు ఏర్పాటుచేసి వివరాలు రాబట్టామన్నారు.

చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top