
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు.
వన్‌టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు.
పలు కేసుల్లో నిందితులు..
నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్‌పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు.
బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్‌ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.