ప్రజల్లో విస్తృతంగా చర్చ వల్లే చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం
అందుకే బెంబేలెత్తిపోతూ మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా తిట్ల దండకం
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని మండిపాటు
గుదిబండగా మారిన అమరావతిపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు
తన స్కాముల కోసం రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నాడు
ప్రజలపై రూ.లక్షల కోట్ల అప్పుల భారం
రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్ల కోసమే అమరావతిలో రూ.2 లక్షల కోట్లు
అందులో 10 శాతం ఖర్చుతో అయ్యే ‘మావిగన్’ వద్దంటారా?
సీఆర్డీఏలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఉందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
అమరావతిలో ఎకరం రూ.10 కోట్లు అంటూ తప్పుడు ప్రచారం
మరి చంద్రబాబు తన ఇంటి కోసం కొన్న స్థలం ఎకరా రూ.3.63 కోట్లేగా?
ఈ లెక్కన ఎకరా రూ.20 కోట్లు ఎప్పుడు అవుతుందో మంత్రి నారాయణ చెప్పగలరా?
ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన రూ.3.57 లక్షల కోట్ల అప్పు ఏమైంది?
మా పథకాలన్నీ రద్దు.. మీరు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్‌కూ దిక్కులేదు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌గా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.
మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్‌పై చర్చ జరగకుండా జగన్‌ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..
వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..
కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.
ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.
164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా?
ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా?
చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.

రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి.
ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?
జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్‌కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్‌మెంట్‌కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.
వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్‌లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.
అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్‌ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.
రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?
ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.
మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.
అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్‌లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?
ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే
⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్‌ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా?
⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు.
⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు.
⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్‌లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.
ఇప్పటికైనా ఆలోచించండి
⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి?
⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు.
⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్‌లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి.
⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది.


